Share News

కోర్టు ఉత్తర్వులను కాదని కూల్చివేతలు

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:17 AM

కోర్టు ఇచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులను కాదని హైడ్రా తమ ఇళ్లను కూల్చివేసిందని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడకు చెందిన తమ్మిశెట్టి శ్రీకాంత్‌ సహా .....

కోర్టు ఉత్తర్వులను కాదని కూల్చివేతలు

  • అనుమతులిచ్చిన అధికార్లపై చర్యల్లేవు

  • హైడ్రాపై హైకోర్టులో పటేల్‌గూడ బాధితుల పిటిషన్‌

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కోర్టు ఇచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులను కాదని హైడ్రా తమ ఇళ్లను కూల్చివేసిందని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడకు చెందిన తమ్మిశెట్టి శ్రీకాంత్‌ సహా మరో 28 మంది ఇళ్ల యజమానులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఆర్‌ చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పటేల్‌గూడ సర్వే నెంబర్‌ 6లో 136 నుంచి 181 వరకు ఉన్న ప్లాట్లలో కొత్తగా కట్టుకున్న 28 ఇళ్లను హైడ్రా నిర్దయగా కూల్చేసిందని పేర్కొన్నారు. నాలా కన్వర్షన్‌కు అనుమతి ఇచ్చిన రెవెన్యూ అధికారులు, ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసిన రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు, భవన నిర్మాణ అనుమతులిచ్చిన మున్సిపల్‌ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం.. అనుమతులిచ్చిన అధికారులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించగా ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ తప్పుడు వివరాలతో అనుమతులు పొందారని పేర్కొన్నారు. ఆ మేరకు ఈ పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంటూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, సంగారెడ్డి కలెక్టర్‌, అమీన్‌పూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దార్‌, హైడ్రాలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ జూన్‌ 15కు వాయిదాపడింది.

ఎన్‌వీఎన్‌ కన్‌స్ట్రక్షన్‌ భూమిలో జోక్యం చేసుకోవడం లేదు: హైడ్రా

కూకట్‌పల్లిలోని సర్వే నం.1003 నుంచి 1006 వరకు 13.17 ఎకరాల్లో ఎన్‌వీఎన్‌ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన భూమిలో జోక్యం చేసుకోవడం లేదని గురువారం ప్రభుత్వం, హైడ్రా న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. 2008లోనే రెగ్యులరైజేషన్‌ చేసి.. ప్రభుత్వమే పంచనామా చేసి పొజిషన్‌ అప్పగించిన ఆ భూమి ఏదులకుంటకు చెందినదని పేర్కొంటూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీనిపై ఇటీవల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టుకు వివరణ ఇచ్చారు.

Updated Date - Jun 05 , 2026 | 04:17 AM