Patancheru MLA Mahipal Reddy: కాంగ్రెలో చేరి తప్పటడుగు వేశా
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:01 AM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా ఆ పార్టీలో చేరాల్సి వచ్చింది. దానితో వెంట్రుక మందం ప్రయోజనం జరగలేదు.
ఆ పార్టీతో వెంట్రుక మందం ప్రయోజనం జరగలేదు
మూడుసార్లు టికెట్ ఇచ్చిన బీఆర్‌ఎ్‌సను మరవలేను
మునిసిపల్ ఎన్నికల్లో కారుకే ప్రచారం: మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా ఆ పార్టీలో చేరాల్సి వచ్చింది. దానితో వెంట్రుక మందం ప్రయోజనం జరగలేదు. తప్పటడుగు వేశా’’ అని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరులో కార్యకర్తలు, కుల సంఘాలు, కాలనీల సంఘాలతో ఆయన అంతర్గతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడారు. కన్నతల్లిలా ఆదరించి మూడు సార్లు టికెట్ ఇచ్చిన బీఆర్‌ఎ్‌సను మరవలేనని, పార్టీ నుంచి నిలబడిన అభ్యర్థుల గెలుపునకు తాను సైతం ప్రచారానికి వస్తానని పేర్కొన్నారు. అందరం కలిసి కష్టపడదామని, అభ్యర్థుల గెలుపునకు కృషి చేద్దామని, ఇందుకు కార్మిక, కుల సంఘాలు, పెద్దలందరూ సహకరించాలని కోరారు. బీఆర్‌ఎస్ తరఫున నిలబడిన 104 మంది కౌన్సిలర్లను గెలిపించుకుందామని చెప్పారు. ఇందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తామని తెలిపినట్టు సమాచారం. సాధ్యమైనంత వరకు సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి ప్రచారం చేస్తారని, తాను కూడా కలిసి పని చేస్తానని మహిపాల్‌రెడ్డి అన్నారు.