Share News

Local Body Elections: పరిషత్‌ ఎన్నికలూ ఫిబ్రవరిలోనే!

ABN , Publish Date - Jan 12 , 2026 | 03:27 AM

రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రభుత్వం పరిషత్‌ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ప్రారంభించింది.

Local Body Elections: పరిషత్‌ ఎన్నికలూ ఫిబ్రవరిలోనే!

  • పాలకమండళ్లు లేక నిలిచిపోయిన రూ.550 కోట్ల కేంద్ర నిధులు

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి

  • లేనిపక్షంలో మురిగిపోనున్న 15వ ఆర్థిక సంఘం నిధులు

  • పురపోరు ముగిసిన వెంటనే పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు కసరత్తు

  • బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్‌ యోచనలో కాంగ్రెస్‌

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రభుత్వం పరిషత్‌ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26కు)గాను 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు కేటాయించిన రూ.550 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొనడంతో.. వీలైనంత త్వరగా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జనవరి చివరి వారంలో మొదలై.. ఫిబ్రవరి రెండు, మూడు వారాల్లో ముగియనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మునిసిపల్‌ ఎన్నికలు ముగియగానే ఫిబ్రవరిలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి.. అదే నెలాఖరు లేదా మార్చి మొదటివారంలో ప్రక్రియ ముగించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి పరిషత్‌లు, పంచాయతీలు, మునిసిపాలిటీల పాలక మండళ్ల పదవీకాలం ఏడాదిన్నర కిందటే ముగిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. కానీ, 15వ ఆర్థిక సంఘం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు రూ.3 వేల కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. ఇందులో పంచాయతీల వాటా రూ.2,450 కోట్లు కాగా.. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లది రూ.550 కోట్లుగా ఉంది.


ఆర్థిక సంఘం నిధులు మురిగిపోవద్దనే..

పాలక మండళ్లు లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోతే.. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ.3 వేల కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం గడువు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో ముగియనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి 16వ ఆర్థిక సంఘం అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వం డిసెంబరులోనే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించి.. జనవరిలో పంచాయతీ పాలకమండళ్ల వివరాలను 15వ ఆర్థిక సంఘానికి పంపించింది. అయితే ఆ వివరాలన్నీ పరిశీలించి పెండింగ్‌ నిధులను మంజూరు చేయడానికి 20 నుంచి 30 రోజుల సమయం పడుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు పెండింగ్‌లో ఉన్న రూ.550 కోట్ల నిధులు కూడా రావాలంటే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియడానికి గరిష్ఠంగా నెల రోజుల ముందే పాలకమండళ్లను ఎన్నుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. దీంతో మునిసిపల్‌ ఎన్నికలు ముగిసీ ముగియక ముందే పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలు ఉంటాయని అంటున్నాయి.


పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌..!

బీసీలకు 42శాతం రిజర్వేషన్‌పై అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటం, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం మించొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికల్లోనూ బీసీలకు పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్‌ ఇస్తామనిచెప్పి ఎన్నికలకు వెళ్లాలని అధికార కాంగ్రెస్‌ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినా.. 50శాతానికి పైగా పంచాయతీల్లో బీసీలను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు ఆ పార్టీ నాయకత్వం చెబుతోంది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుందని, దాంతో మునిసిపల్‌ ఎన్నికల్లో వారికిచ్చే రిజర్వేషన్‌గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. ఆ మేరకు బీసీలకు రిజర్వేషన్లు పెంచనున్నట్లు చెబుతున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ను 32శాతం -33శాతంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 12 , 2026 | 03:27 AM