పరకాల మళ్లీ రేవూరికే!
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:49 AM
పరకాల రాజకీయం కొత్త మలుపు తిరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల టికెట్‌పై ఆశపెట్టుకున్న ఇద్దరు కీలక నేతలకు.. ఆదివారం పరకాల సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో షాక్ తగిలింది.
వచ్చే ఎన్నికల్లో ప్రకాశ్‌రెడ్డిని గెలిపించాలన్న
ముఖ్యమంత్రి పిలుపుతో విస్తృత చర్చ
ఈ నియోజకవర్గంపై మంత్రి కొండా
సురేఖ, ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఆశలు
సీఎం తాజా పర్యటనకు వారిద్దరూ దూరం
వరంగల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పరకాల రాజకీయం కొత్త మలుపు తిరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల టికెట్‌పై ఆశపెట్టుకున్న ఇద్దరు కీలక నేతలకు.. ఆదివారం పరకాల సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో షాక్ తగిలింది. సీఎం తన ప్రసంగం ప్రారంభంలో, చివరిలోనూ ఇక్కడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒకరకంగా ప్రకాశ్‌రెడ్డికి మళ్లీ టికెట్ ఖరారైనట్టేననే ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా జరుగుతోంది.
కుమార్తె పోటీ కోసం కొండా సురేఖ యత్నాలు..
మంత్రి కొండా సురేఖ గతంలో పరకాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. మంత్రి సొంతూరు వంచనగిరి కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. దీంతో పరకాల నుంచి తన కుమార్తెను పోటీ చేయించాలని కొండా దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కుమార్తె కొండా సుష్మిత పరకాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుందని పలుమార్లు ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకా్‌శ్‌రెడ్డితో కొండా దంపతులకు రాజకీయ విభేదాలు కూడా నెలకొన్నాయి.
రేసులో ఇనుగాల వెంకట్రామిరెడ్డి
ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన ఇనుగాల వెంకట్రామిరెడ్డికి అధిష్ఠానం అవకాశం ఇవ్వలేదు. బీజేపీ నుంచి వచ్చిన రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. అయితే ఇనుగాలకు కుడా చైర్మన్ పదవితో పాటు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించింది. కుడా చైర్మన్ పదవీకాలం పూర్తికావటంతో రెన్యువల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పరకాల రేసులోనూ నిలుస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గంలో వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రకాశ్‌రెడ్డిని గెలిపించాలని సీఎం కోరడం కొండా, ఇనుగాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీఎం పర్యటనకు కొండా సురేఖ దూరం
ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సీఎం రేవంత్ పాల్గొన్న కార్యక్రమాలు, సభలకు.. జిల్లా పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ హోదాల్లోని నేతలంతా హాజరయ్యారు. కానీ ఈ జిల్లాకే చెందిన మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కుడా మాజీ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి కూడా పాల్గొనలేదు. వారికి ఆహ్వానం అందలేదా, లేక కావాలనే సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారా? అన్నదానిపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.