Share News

రూ.13వేల కోట్ల ఆన్‌లైన్‌ గేమింగ్‌ సిండికేట్‌ సూత్రధారి పంకజ్‌ అరెస్టు

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:03 AM

దాదాపు రూ.13 వేల కోట్ల విలువైన ఆన్‌లైన్‌ గేమింగ్‌ సిండికేట్‌ ఆర్థిక వ్యవహారాలను చక్కబెడుతున్న పేమెంట్‌ గేట్‌వే నిర్వాహకుడిని డైరెక్టరేట్‌ జనరల్‌...

రూ.13వేల కోట్ల ఆన్‌లైన్‌ గేమింగ్‌ సిండికేట్‌ సూత్రధారి పంకజ్‌ అరెస్టు

  • హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసిన డీజీజీఐ అధికారులు

  • ఫిన్‌టెక్‌ కంపెనీల సాయంతో అక్రమ ఆన్‌లైన్‌ గేమింగ్‌ వెబ్‌సైట్ల నిర్వహణ

  • విచారణలో గుర్తించిన అధికారులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): దాదాపు రూ.13 వేల కోట్ల విలువైన ఆన్‌లైన్‌ గేమింగ్‌ సిండికేట్‌ ఆర్థిక వ్యవహారాలను చక్కబెడుతున్న పేమెంట్‌ గేట్‌వే నిర్వాహకుడిని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (డీజీజీఐ) అధికారులు గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. పలు సంస్థలకు ఫ్రాడ్‌ డిటెక్షన్‌ (మోసాల గుర్తింపు), కస్టమర్‌ వెరిఫికేషన్‌, డిజిటల్‌ కేవైసీ సేవలను అందిస్తున్న అడ్సమ్‌ అడ్వైజరీ సర్వీస్‌ డైరెక్టర్‌ పంకజ్‌ కుమార్‌ను ఆన్‌లైన్‌ గేమింగ్‌ కేసుల విచారణలో భాగంగా అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ.13వేల కోట్ల విలువైన వ్యవస్థీకృత సిండికేట్‌, పేమెంట్‌ అగ్రిగేటర్లు, పేమెంట్‌ గేట్‌వేలు, థర్డ్‌ పార్టీ టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్లతో కలిసి ఫిన్‌టెక్‌ కంపెనీల సాయంతో అక్రమ ఆన్‌లైన్‌ గేమింగ్‌ వెబ్‌సైట్లు నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైనట్టు చెప్పారు. ఈ సిండికేట్‌లో పంకజ్‌ కీలక సూత్రధారుల్లో ఒకర న్నారు. ఆర్బీఐ నియంత్రణలో ఉండే పేమెంట్‌ గేట్‌వేలు, బ్యాంకింగ్‌ యూజ్‌ పేమెంట్‌ అగ్రిగేటర్ల (బీఏపీఏ) తరఫున వ్యాపారులు, షెల్‌ కంపెనీలకు మోసపూరితమైన కేవైసీ వెరిఫికేషన్‌ చేయడంలో పంకజ్‌కుమార్‌ సహకరించినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ నుంచి వచ్చే డబ్బుకు అవసరమైన యుపీఐ ఇంటిగ్రేషన్‌ కోసం ఆయన షెల్‌ కంపెనీలను చేర్చుకోవడంలో సహాయపడ్డారని అధికారులు వివరించారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ సిండికేట్‌ ద్వారా లభించిన అక్రమ ఆదాయాన్ని పొందిన లబ్ధిదారుల్లో పంకజ్‌ ఒకరని పేర్కొన్నారు. కుట్రలోని సూత్రధారుల్లో ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నామని, ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన బ్యాంక్‌ ఖాతాలను స్థంభింపజేసినట్టు చెప్పారు. ఈ సిండికేట్‌కు సంబంధించి ఇప్పటికే వైఎస్‌ ప్రభుకుమార్‌, రాజశేఖర్‌ రెడ్డిలను అరెస్టు చేసినట్టు తెలిపారు. గత ఏడాదిలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ స్థూల విలువ రూ.2 లక్షల కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 02:03 AM