మూడో అంతస్తు బాల్కనీ కూలిపోయి.. తండ్రి, కొడుకు దుర్మరణం
ABN , Publish Date - Mar 23 , 2026 | 05:41 AM
ఆ ఇద్దరు తండ్రీకొడుకులను మృత్యువు వెంటాడింది. దాదాపు 25 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో విద్యుత్తు మరమ్మతులు చేసేందుకుగాను యజమాని పిలిస్తే కాంట్రాక్టు మాట్లాడుకునేందుకు వెళ్లారు.
వారిని మరమ్మతుల కోసం పిలిపించుకున్న యజమాని
మాట్లాడుకుంటుండగా ప్రమాదం
ఇంటి యజమానికి తీవ్రగాయాలు
పంజాగుట్ట, మార్చి22(ఆంధ్రజ్యోతి): ఆ ఇద్దరు తండ్రీకొడుకులను మృత్యువు వెంటాడింది. దాదాపు 25 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో విద్యుత్తు మరమ్మతులు చేసేందుకుగాను యజమాని పిలిస్తే కాంట్రాక్టు మాట్లాడుకునేందుకు వెళ్లారు. యజమాని వారిని తీసుకొని భవనం మూడో అంతస్తుకు వెళ్లాడు. అక్కడ.. పైన కాంక్రీటు, కింద ఐరన్‌తో కూడి బాల్కనీ స్లాబ్ వద్ద ముగ్గురు నిల్చుని మాట్లాడుకుంటున్నారు. అయితే కాళ్ల కింద నేల కుంగినట్లుగా ఒక్కసారిగా బాల్కనీ స్లాబ్ కూలిపోయింది. ముగ్గురూ నేరుగా కిందపడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాలై తండ్రీకొడుకులు దుర్మరణంపాలయ్యారు. భవన యజమాని తీవ్రంగా గాయపడ్డాడు. పంజాగుట్టలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... బేగంపేట మెథడిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్న ద్వారకా ప్రసాద్.. తన ఇంట్లో విద్యుత్తు, ఇతర మరమ్మతులు చేసేందుకు సీతారాంబాగ్‌కు చెందిన కంట్రాక్టర్లు, తండ్రీకొడుకులైన దేవీదాస్, వివేక్‌ను పిలిపించాడు. వారిద్దరు ఈ నెల 21న ద్వారకా ప్రసాద్ ఇంటికొచ్చారు. భవనం మూడో అంతస్తులోని బాల్కనీలో నిల్చుని ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో, బాల్కనీ స్లాబ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ముగ్గురు కిందపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో దేవీదాస్, వివేక్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటి యజమాని ద్వారకా ప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల సమీప బంధువు నవీన్ ధర్మశాల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.