సమాచారం కోసం మూడున్నరేళ్ల నిరీక్షణ
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:23 AM
గరిష్ఠంగా నెల రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారాన్ని మూడున్నరేళ్లు దాటినా ఇవ్వని పంచాయతీ కార్యదర్శికి రాష్ట్ర సమాచార కమిషన్ రూ.20వేల జరిమానా విధించింది.
పంచాయతీ కార్యదర్శికి జరిమానా
హైదరాబాద్, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): గరిష్ఠంగా నెల రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారాన్ని మూడున్నరేళ్లు దాటినా ఇవ్వని పంచాయతీ కార్యదర్శికి రాష్ట్ర సమాచార కమిషన్ రూ.20వేల జరిమానా విధించింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామ నివాసి క్రిష్ణ 2022 జూన్‌లో సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ పరిధిలోని ఇండియా సిమెంట్ కంపెనీ నిర్మించిన భవనాల అనుమతుల వివరాలు ఇవ్వాలని కోరారు. 30 రోజుల్లో ఇవ్వాల్సిన ఆ సమాచారం రాకపోవడంతో మొదటి అప్పీలేట్ అథారిటీ అయిన ఎంపీడీవో కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అక్కడా నెల రోజుల్లో ఇవ్వకపోవడంతో రాష్ట్ర సమాచార కమిషన్‌కు అదే ఏడాది ఫిర్యాదు చేశారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన సహ కమిషన్.. పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న సమాచారం ఇవ్వడానికి మూడున్నరేళ్లు సమయం కావాలా? అని ప్రశ్నించింది. తీవ్రమైన జాప్యం చేసినందుకు బాద్యుడైన పంచాయతీ కార్యదర్శికి రూ. 20వేల భారీ జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది.