Share News

kumaram bheem asifabad- పంచాయతీ నిధులు.. కరెంట్‌ బిల్లులకే!

ABN , Publish Date - Jul 22 , 2026 | 10:56 PM

గ్రామాల్లో వెలుగులు నింపాల్సిన నిధులు విద్యుత్‌ బకాయిల చీకట్లోకి వెళ్లేలా ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన అభివృద్ధి నిధులపై విద్యుత్‌శాఖ కన్ను పడటంతో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 335గ్రామపంచాయతీల్లో అభివృద్ధి స్తంభించే ప్రమాదం పొంచి ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేక, అప్పులు చేసి పనులు చేస్తున్నా.. బిల్లుల భారం మాత్రం సర్పంచుల మెడకు చుట్టుకుంటోంది.

kumaram bheem asifabad- పంచాయతీ నిధులు.. కరెంట్‌ బిల్లులకే!
లోగో

- 15వ ఆర్థికసంఘం నిధుల నుంచి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రపాయంగా ఆదేశాలు

- ఆందోళనలో సర్పంచులు, కార్యదర్శులు

వాంకిడి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వెలుగులు నింపాల్సిన నిధులు విద్యుత్‌ బకాయిల చీకట్లోకి వెళ్లేలా ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన అభివృద్ధి నిధులపై విద్యుత్‌శాఖ కన్ను పడటంతో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 335గ్రామపంచాయతీల్లో అభివృద్ధి స్తంభించే ప్రమాదం పొంచి ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేక, అప్పులు చేసి పనులు చేస్తున్నా.. బిల్లుల భారం మాత్రం సర్పంచుల మెడకు చుట్టుకుంటోంది. గ్రామపంచాయతీలకు కేంద్రప్రభుత్వం పంపిన అభివృద్ధి నిధులు.. ఇప్పుడు విద్యుత్‌ బిల్లుల చెల్లింపులకే సరిపోని దుస్థితి నెలకొంది. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణ, వీధిదీపాల మరమ్మతులు, ఫాగింగ్‌ వంటి అత్యవసరసేవల కోసం కేటాయించిన 15వ ఆర్థికసంఘం నిదులపై విద్యుత్‌శాఖ కన్నేసింది. జిల్లాలోని 335గ్రామ పంచాయతీల్లో స్ట్రీట్‌లైట్లు, వాటర్‌ వర్క్స్‌, సంబంధించిన విద్యుత్‌బిల్లుల బకాయిలు రూ.2,93,34 కోట్లకు చేరడం గమనార్హం. ఈ పరిణామం గ్రామపాలనలో తీవ్రఆర్థిక సంక్షోభానికి అద్దం పడుతున్నది.

ఫ అయోమయంలో సర్పంచులు, కార్యదర్శులు

పంచాయతీల విద్యుత్‌ బిల్లులను 15వ ఆర్థికసంఘం నిధుల నుంచే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా బుధవారం ఆదేశాలు జారీ చేయడంతో గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 52జే ప్రకారం విద్యుత్‌చార్జీల చెల్లింపులకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తుంది. మరోవైపు విద్యుత్‌శాఖ అధికారులు జిల్లా పంచాయతీ అధికారులకు లేఖలు రాయడంతో నిధులను మళ్లించక తప్పనిపరిస్థితి నెలకొంది.

ఫ వర్షాకాలంలో ప్రజారోగ్యానికి ముప్ప..

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగీ, మలేరియా, వైరల్‌జ్వరాల నివారణకు ఫాగింగ్‌, డ్రైయినేజీల శుభ్రత, చెత్తతొలగింపు అత్యంత కీలకం. ఇటువంటి సమయంలో అందుబాటులో ఉన్న నిధులన్నీ విద్యుత్‌బిల్లులకే కేటాయిస్తే ప్రజారోగ్యం అగమ్యగోచరంగా మారుతుందని ప్రజాప్రతి నిధులు ఆందోళన చెందుతున్నారు.

ఫ ప్రభుత్వమే ప్రత్యేక నిధులు ఇవ్వాలి

- చునార్‌కార్‌ సతీష్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు

వాంకిడి గ్రామ పంచాయతీకి రూ.4.63లక్షల బిల్లుల బకాయిలు ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులతో విద్యుత్‌దీపాల కొనుగోలు, ట్రాక్టర్‌ మరమ్మతులు, పారిశుధ్యం, తాగునీటి పనులు చేస్తున్నాం. చిన్న పంచాయతీల్లో బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం రాష్ట్ర నిధులు విడుదల చేయకుండా కేంద్రం ఇచ్చిన అభివృద్ధి నిధులను విద్యుత్‌బిల్లుల కోసం లాక్కోవడం సమంజసం కాదు. ఇప్పుడు అభివృద్ధి నిధులు విద్యుత్‌ బిల్లులకు మళ్లిస్తే గ్రామాభివృద్ధి స్తంభించిపోతుంది. అప్పులు చేసి పనులు చేయలేక సతమతమవుతున్నాం. ఈ భారాన్ని పంచా యతీలపై మోపకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక నిధులతో బకాయిలు చెల్లించాలి.

Updated Date - Jul 22 , 2026 | 10:56 PM