దేశంలోనే పాలేరు ధనిక నియోజకవర్గం
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:48 AM
దేశంలోనే అత్యంత ధనిక నియోజకవర్గం పాలేరు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి...
ఏడాదిలోనే జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేసి పాలేరుకు గోదావరి జలాలందిస్తాం: మంత్రి తుమ్మల
నేలకొండపల్లి/ఖమ్మం రూరల్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యంత ధనిక నియోజకవర్గం పాలేరు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోని నేలకొండపల్లి మండలం చెర్వుమాధారం, ఏదులాపురం మునిసిపాలిటీలోని కరుణగిరిలో సహకార బ్యాంకు శాఖలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. దేశంలో ఏ నియోజకవర్గంలో లేని సాగునీటి సౌకర్యాలు పాలేరు నియోజకవర్గంలో ఉన్నాయన్నారు. రూ.4,900 కోట్లతో జూలూరుపాడు టన్నెల్ పనులు వేగంగా సాగుతున్నాయని, సంవత్సరం లోపు పనులు పూర్తి చేసి పాలేరును గోదావరి జలాలతో పునీతం చేస్తామని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రైతులు 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి రికార్డు సృష్టించారని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సహకార బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన ఆర్థిక సేవలందించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.