Share News

పాలమూరు-రంగారెడ్డికి రూ.14 వేల కోట్లు అవసరం

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:33 AM

వచ్చే నాలుగేళ్లలో రూ.14,602కోట్లు వెచ్చిస్తేనే... పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యే అవకాశం ఉందని సాగు నీటి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

పాలమూరు-రంగారెడ్డికి రూ.14 వేల కోట్లు అవసరం

  • ఈ ఏడాదే 10,194 కోట్లు ఖర్చు పెట్టాలి

  • ఏటా నిధులు ఇస్తేనే 2028-29 నాటికి నాలుగు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు

  • లెక్కలు సిద్ధం చేసిన సాగు నీటి శాఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): వచ్చే నాలుగేళ్లలో రూ.14,602కోట్లు వెచ్చిస్తేనే... పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యే అవకాశం ఉందని సాగు నీటి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2026-27లో రూ.10,194కోట్లు, 2027-28లో రూ.1936.40కోట్లు, 2028-29లో రూ.1932కోట్లు కలిపి మొత్తం రూ.14,062 కోట్లు వెచ్చిస్తే... 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే అవ కాశాలుంటాయని భావిస్తున్నారు. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా రూ.10,194 కోట్లు వెచ్చించాలి. అయితే, మొత్తం రుణాలు, ఉద్యోగుల జీతాలు మినహాయిస్తే.. నీటిపారుదల శాఖ బడ్జెట్‌ కేటాయింపులు కూడా అంతకన్నా తక్కువే ఉండడం గమనార్హం. దీంతో నిర్దేశిత లక్ష్యం మేర ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఏటా కృష్ణాలో తెలంగాణ నీటి కోటాను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. దీన్ని భర్తీ చేయడానికే 60 రోజుల పాటు రోజుకు 1.5 టీఎంసీల నీటిని తరలించేలా 90 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. తద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌లో 6.40 టీఎంసీలు, ఏదులలో 6.55 టీఎంసీలు, వట్టెంలో 16.74 టీఎంసీలు, కరివెనలో 17.34 టీఎంసీలు, ఉద్ధండాపూర్‌లో 16.03 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నారు. వీటిని పూర్తి చేస్తేనే కృష్ణాలో నీటి వినియోగం పెంచుకోవడంతోపాటు తాగునీటి ఇబ్బందులనూ దూరం చేయవచ్చు. ప్రస్తుతం కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతోనే తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ పథకంలో ఐదు మోటార్లు ఉంటే... అందులో మూడు మాత్రమే నడుస్తున్నాయి. మిగిలిన రెండు మోటార్లు రిపేర్‌ చేసుకోవాలంటే తొలుత ఈ ప్రాజెక్టుకు హెడ్‌ రెగ్యులేటరీని నిర్మించాలి. దీనికన్నా ముందు పాలమూరు-రంగారెడ్డిలో నార్లాపూర్‌ పంప్‌హౌ్‌సను సిద్ధం చేయాల్సి ఉంటుంది. మరోవైపు.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్‌-ఏదుల లింక్‌ కెనాల్‌ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దీనిని గత ఏడాది అక్టోబరు 15వ తేదీ కల్లా పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. నిర్దేశిత గడువు ముగిసి ఆర్నెల్లు కావస్తున్నా పనుల్లో పెద్దగా పురోగతి లేదు. లింక్‌ కెనాల్‌ అంచనాలను పలు దఫాలుగా సవరించినప్పటికీ కాంట్రాక్టర్‌ ఆశించిన స్థాయిలో పనులు చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. ఈ కెనాల్‌ అంచనా వ్యయం రూ.780.63 కోట్లు కాగా, ఇప్పటిదాకా రూ.619 కోట్లు వెచ్చించారు. మరో రూ.161.43 కోట్ల నిధులు వెచ్చించాల్సి ఉంది.

Updated Date - Apr 07 , 2026 | 05:33 AM