Share News

‘పాలమూరు’కు పెరిగిన అంచనాలు

ABN , Publish Date - Jul 18 , 2026 | 05:35 AM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ అంచనా వ్యయాన్ని ప్రభుత్వం పెంచింది. ఈ పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో..

‘పాలమూరు’కు పెరిగిన అంచనాలు

  • 4 ప్యాకేజీల్లో సవరణ అంచనాలకు క్యాబినెట్‌ ఆమోదం

  • ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులను తొలగించేందుకే

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ అంచనా వ్యయాన్ని ప్రభుత్వం పెంచింది. ఈ పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో.. ఇందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకుగాను పలు ప్యాకేజీల్లో సవరణ నిర్మాణ అంచనాలకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులోని రెండో రిజర్వాయర్‌ ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్‌కు నీటిని తరలించడానికి వీలుగా చేపట్టిన ట్విన్‌ టన్నెల్‌ నిర్మాణం 6.40 కిలోమీటర్ల నుంచి 25.40 కిలోమీటర్ల పనులకు సంబంధించిన ప్యాకేజీ-7 సవరణ నిర్మాణ అంచనాలకు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. దీని వాస్తవిక నిర్మాణ అంచనా వ్యయం రూ.2263.10 కోట్లు కాగా, తాజా ఆమోదంతో అది రూ.3181.10 కోట్లకు పెరిగింది. డిజైన్‌లలో మార్పులు, న్యూ ఇంటేక్‌ నిర్మాణం,భౌగోళిక పరిస్థితుల కారణంగా రూ.104.93 కోట్లు. ప్రైస్‌ అడ్జె్‌స్టమెంట్‌ కింద రూ.497.25 కోట్లు, పన్నుల రూపంలో రూ.315 కోట్లు కలిపి రూ.918 కోట్ల మేర అదనంగా పెరిగింది. ఇక వటె ్టం రిజర్వాయర్‌ బండ్‌ నిర్మాణానికి సంబంధించిన ప్యాకేజీ-11 సవరణ నిర్మాణ అంచనా వ్యయం కూడా పెరిగింది. దీని వాస్తవిక నిర్మాణ అంచనా వ్యయం రూ.1680.70 కోట్లు కాగా, దీనిని రూ.2363.45 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో 40.62 శాతం నిర్మాణ అంచనా వ్యయం పెరిగినట్లయింది.


ప్యాకేజీ-15 సవరణకూ ఆమోదం..

మరో ప్యాకేజీ-15 సవరణ నిర్మాణ అంచనాలకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీ వాస్తవిక నిర్మాణ అంచనా వ్యయం రూ.976.70 కోట్లు కాగా, తాజాగా దానిని రూ.1468.55 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సీవోటీ ఎక్స్‌కావేషన్‌, కేసింగ్‌ సాయిల్స్‌, హెడ్‌ రెగ్యులేటరీ నిర్మాణం, పన్నులు, ప్రైస్‌ అడ్జ్‌స్టమెంట్‌ వంటి కాంపోనెంట్ల కారణంగా నిర్మాణ అంచనా వ్యయం పెరిగిందని అధికారులు నివేదించగా.. మంత్రివర్గం ఓకే చేసింది. కాగా, ఉద్దంఢపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించిన ప్యాకేజీ-17 సవరణ అంచనాలకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని వాస్తవిక నిర్మాణ అంచనా వ్యయం రూ.643 కోట్లు కాగా, రూ.260.78 కోట్లు అదనంగా పెరిగి.. రూ.903.78 కోట్లకు చేరింది. డిజైన్ల మార్పులు, డీపర్‌ కటాఫ్‌ ట్రెంచెస్‌, క్లాజ్‌-44 ప్రకారం ప్రైజ్‌ అడ్జెస్ట్‌మెంట్ వల్ల నిర్మాణ అంచనా వ్యయం పెరిగిందని గుర్తించారు. మరోవైపు చిన్నకాళేశ్వరం(ముక్తేశ్వర్‌) ఎత్తిపోతల పథకం ఈపీసీ టెండర్లను రద్దు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిరుపయోగంగా ఉన్న జీఆర్‌పీ పైపుల కోసం అంతకుముందు టెండర్లు దక్కించుకున్న సంస్థ నుంచి రూ.41.86 కోట్లను రికవరీ చేయాలని నిర్ణయించింది. ఇక ఈపీసీ కింద పూర్తికాని పలు పనులను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కన్నెపల్లి గ్రామం వద్ద గోదావరి నది నుంచి 4.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. 45 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా 2007లో రూ.443 కోట్ల నిర్మాణ అంచనాలతో ఈ పథకాన్ని చేపట్టగా... దీని డీపీఆర్‌కు సీడబ్ల్యూసీ ఆమోదం కూడా తెలిపింది. సాంకేతిక సలహా మండలి(టీఏసీ) సైతం ఆమోదించింది. దాంతో భూసేకరణకు అవసర మైన నిధులు కేటాయించి.. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

Updated Date - Jul 18 , 2026 | 05:37 AM