Palamuru Rangareddy Lift Project: పరస్పరం నిందించుకునేందుకే ..
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:33 AM
రాజకీయ పార్టీలు పరస్పరం నిందించుకోవడానికి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను మభ్యపెట్టడానికే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎంచుకున్నారని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి అన్నారు.
రంగారెడ్డి-పాలమూరును ఎంచుకున్నారు
మహబూబ్‌నగర్ జిల్లాను రాజకీయంగా వాడుకుంటున్నారు
పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలు పరస్పరం నిందించుకోవడానికి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను మభ్యపెట్టడానికే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎంచుకున్నారని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి అన్నారు. 2015 జూన్ 11నశంకుస్థాపన చేసి.. మూడేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పదేళ్లయినా పూర్తి కాకపోవడానికి కారణాలేమిటి? అని ఒక ప్రకటనలో ప్రశ్నంచారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా నిధులన్నీ కాళేశ్వరానికి వెచ్చించి... ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుపై ఏ స్థాయిలో దృష్టి పెట్టాలో... ఆ స్థాయిలో పెట్టలేదన్నారు. దీర్ఘకాల పోరాటం అనంతరం జూరాల నుంచి పాలమూరు-రంగారెడ్డి చేపట్టడానికి వైఎస్ అంగీకారం తెలిపితే... కిరణ్‌కుమార్‌రెడ్డి జీవో ఇచ్చారన్నారు. జూరాల కేంద్రంగా ప్రాజెక్టు చేపట్టకుండా రీ డిజైన్ చేసి... అన్యాయం చేశారన్నారు. రెండో తప్పిదం ఏదుల నుంచి డిండి ఎత్తిపోతలను కలుపడం అని, మూడోది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్ష్మిదేవీపల్లి రిజర్వాయర్‌ను బీఆర్‌ఎస్ పక్కనపెట్టిందని, కాంగ్రెస్ కూడా అదే విధానాన్ని అనుసరిస్తోందని విమర్శించారు. లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ కట్టకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రయోజనం నెరవేరదన్నారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.55 వేల కోట్లు అయితే... అందులో రూ.27 వేల కోట్లు వెచ్చించారన్నారు. ఏ లెక్కన 90 శాతం పనులు పూర్తయిన ట్లు? అని ప్రశ్నించారు. కేసీఆర్ న ల్లగొండ జిల్లా నేతలకు లొంగి... డిండిని పాలమూరుకు లింక్ చేస్తే... సీఎం పదవిని కాపాడుకోవడానికి పాలమూరు-రంగారెడ్డిలో ఏదులకు డిండికి రేవంత్‌రెడ్డి లింక్ కలిపారని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయంగా వాడుకునే వస్తువుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పరస్పరం నిందించుకోవడానికి, మఽభ్యపెట్టడానికి వినియోగించుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉంటే... పాలమూరు-రంగారెడ్డిని రెండు భాగాలుగా విడగొట్టాలని.. తొలుత డిస్ట్రిబ్యూటరీలకు నిధులిచ్చి.. ఆ తర్వాత లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ కట్టాలన్నారు. ఆ తర్వాత జూరాల నుంచి మరో భాగాన్ని చేపట్టాలని అభిప్రాయపడ్డారు.