పాలమూరు-రంగారెడ్డిలో కీలక ఘట్టం
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:04 AM
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దశాబ్దాల కల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద..
నేడు ఒకటో మోటార్ వెట్ రన్ పునఃప్రారంభం
సీఎం రేవంత్ ఆదేశాలతోకదిలిన యంత్రాంగం
కొల్లాపూర్, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దశాబ్దాల కల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద.. ఈ ప్రాజెక్టులో కీలకమైన ఒకటో నెంబర్ మోటార్ యూనిట్-1 వెట్ రన్‌ను పునఃప్రారంభించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ఆదివారం రాత్రికల్లా అన్ని రకాల సాంకేతిక, క్షేత్రస్థాయి ఏర్పాట్లను పూర్తిచేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల పాటు కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఉండి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం పనుల్లో వేగం పెంచాలని, మోటార్లను సిద్ధం చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు సలహాదారు పెంటారెడ్డి వారం రోజులుగా ప్రాజెక్టు వద్దే బస చేసి, అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ కసరత్తును విజయవంతం చేశారు. గతంలో 2023 సెప్టెంబరు 16వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఒకటో నెంబరు మోటార్ నాడు 24 గంటల పాటు నిరంతరాయంగా నడిచింది. ఆ తరువాత సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు డివిజన్ ఇంజనీర్(డీఈ), ఇన్‌చార్జి ఈఈ లోకిలాల్ మాట్లాడుతూ... సుదీర్ఘ కాలంగా వినియోగంలో లేని ఈ మోటార్‌కు అవసరమైన బేరింగ్ ఆయిల్ మార్చడం, ఇతర సాంకేతిక లోపాలను సరిదిద్దడం వంటి అన్ని నిర్వహణ పనులను, పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.
సోమవారం ఉదయం ప్రాథమికంగా కొద్దిసేపు(సుమారు పావుగంట) నీటిని పంపింగ్ చేసి పరిశీలిస్తామని తెలిపారు. ఇప్పటికైతే అంతా సజావుగా ఉంది... కృష్ణానదిలోకి వరద జలాలు చేరిన వెంటనే ఈ మోటార్ ద్వారా అంజనగిరి రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసి, పూర్తిస్థాయి వెట్ రన్ ప్రక్రియను ముగిస్తాం అని ఆయన వివరించారు. ఒకటో నెంబరు మోటార్ పునఃప్రారంభంతో పాటు మరో వారం రోజుల్లో రెండో నంబరు మోటార్(యూనిట్2)ను కూడా పూర్తి స్థాయిలో నడిపేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మోటార్ల పునఃప్రారంభం, తాజా పురోగతికి సంబంధించిన పూర్తి నివేదికను ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు సమర్పించినట్లు సమాచారం.