Share News

ఈ టర్మ్‌లోనే పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి

ABN , Publish Date - May 31 , 2026 | 05:26 AM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు సహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ఈ టర్మ్‌లోనే పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి

  • అందుకోసం ఎన్ని నిధులైనా విడుదల

  • పాలమూరు ఎత్తిపోతల పనులు 90శాతం పూర్తిచేశామనే బీఆర్‌ఎస్‌ వాదన పచ్చి అబద్ధం: మంత్రి ఉత్తమ్‌

  • అజిలాపూర్‌ మినీ లిఫ్ట్‌ కు శంకుస్థాపన

దేవరకద్ర/మహబూబ్‌నగర్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు సహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో పెండింగ్‌ ప్రాజెక్టులను పరిశీలించేందుకు జూన్‌ 4, 5 తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారని చెప్పారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి కోసం ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్‌ గ్రామ సమీపంలో రూ.32.05 కోట్లతో నిర్మించనున్న మినీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డితో కలిసి ఉత్తమ్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. అజిలాపూర్‌ ప్రాజెక్టు పూర్తయితే దేవరకద్ర మండలంలో 14 వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యం పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టులకు ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పూర్తి చేశామన్న బీఆర్‌ఎస్‌ నేతల మాటలు పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం తర్వాత అజిలాపూర్‌ శివార్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్‌, వాకిటి శ్రీహరి పరిశీలించారు.

కేంద్రం అనుమతికి మించి కొనుగోలు చేస్తున్నాం..

దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం, తాను కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మంత్రి ఉత్తమ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో పండిన ధాన్యంలో కేంద్రం 38శాతమే కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా రూ.16,479 కోట్లు రైతులకు చెల్లించి మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తోందని చెప్పారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై ఉత్తమ్‌ సమీక్షించారు. జూన్‌ 4, 5 తేదీల్లో సీఎం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఇక్కడి అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు, చేపట్టాల్సిన పనుల నివేదికలను సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

Updated Date - May 31 , 2026 | 05:26 AM