ఈ టర్మ్‌లోనే పాలమూరు ప్రాజెక్టులన్నీ : ఉత్తమ్
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:23 AM
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలు సహా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్/ భూత్పూర్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలు సహా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టును తేనున్నామని ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కరివెన రిజర్వాయర్ వద్ద విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నీటిపారుదల రంగం నాశనం అయిందని విమర్శించారు. నీటి కోసం దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీరనున్నాయని, త్వరలోనే జిల్లా దశ మారబోతుందని చెప్పారు. ‘‘పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేసింది. మనల్ని, మన పిల్లల్ని తాకట్టుపెట్టి దాదాపు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు తెచ్చి.. నామమాత్రపు ఆయకట్టు తెచ్చారు. కాళేశ్వరం, పాలమూరు, కల్వకుర్తి, దేవాదుల, సీతారామ, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ఏ ప్రాజెక్టు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగు, తాగునీటి అవ సరాలకు జూరాల నుంచి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదిస్తే... దాన్ని శ్రీశైలానికి తరలించి అన్యాయం చేశారు. కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయింది.’’ అని మండిపడ్డారు. గత ప్రభుత్వం కంటే కృష్ణా జలాలను అత్యధికంగా ఉపయోగించుకుంటున్నామని, దీనివల్ల ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వరి సాగు రికార్డు స్థాయికి చేరిందని అన్నారు.. కృష్ణా, గోదావరి బేసిన్లలో దేశంలోనే అత్యధిక వరి దిగుబడి వస్తోందని, ఈ యాసంగిలో 71.15 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించబోతున్నామని వెల్లడించారు. కేంద్రం సహకరించకపోయినా 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరిస్తున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గూడెందొడ్డి, భూత్పుర్ రిజర్వాయర్ల సామర్థ్యాలు పెంచుతున్నామని, ప్రాజెక్టుల భూసేకరణ ఆర్నెల్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు.