సభలో కౌశిక్ దుమారం
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:51 AM
శాసనసభలో ఆదివారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రవర్తనపై తీవ్ర దుమారం రేగింది. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల ఆయన ప్రవర్తించిన తీరును మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు.
కడియం శ్రీహరిని తుపాకీతో కాల్చేస్తానన్నట్లుగా హావభావాలు!
మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్
నిరసనల మధ్యే 5 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్ర జ్యోతి): శాసనసభలో ఆదివారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రవర్తనపై తీవ్ర దుమారం రేగింది. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల ఆయన ప్రవర్తించిన తీరును మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. బీఆర్‌ఎస్ సభ్యు లు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న సమయం లో కడియం శ్రీహరి మాట్లాడుతుండగా.. కౌశిక్‌రెడ్డి ఆయనను తుపాకీతో కాల్చేస్తానన్నట్లుగా హావభావాలు ప్రదర్శించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కడియంను చంపేస్తానన్నట్లుగా కౌశిక్‌రెడ్డి ప్రవర్తన ఉందన్నారు.
దళిత నేత పట్ల కౌశిక్‌రెడ్డి దురహంకారంగా ప్రవర్తించారని, ఆయన నుంచి దళిత సభ్యులకు సభలో రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కౌశిక్‌రెడ్డి లాంటి వ్యక్తి శాసనసభలో ఉండడానికి అర్హుడు కాదని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డి ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయడంతోపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. కౌశిక్‌రెడ్డి ప్రవర్తన మార్చుకోవాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ హెచ్చరించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. పాడి కౌశిక్‌రెడ్డి హావభావాలు ఏకే 47తో కడియంను కాల్చివేస్తానన్నట్లుగా ఉన్నాయన్నారు. సీనియర్ దళిత నేత పట్ల ఇంత దురహంకారం ఏంటని ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్, హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలన్నారు. దళిత నాయకులపై గూండాగిరి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ.. దళిత నాయకుల పేర్లు చెబితేనే వినడానికి బీఆర్‌ఎస్ నేతలు సిద్ధంగా లేరని, దళిత బిడ్డ కడియం శ్రీహరి పట్ల కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరు అభ్యతరకరమని అన్నారు. బీఆర్‌ఎస్ ఫ్యూడల్ మనస్తత్వానికి ఇది అద్దం పడుతోందన్నారు. దళితులు, గిరిజనులకు శాసనసభలో కూడా రక్షణ లేదా? అని ప్రశ్నించారు.
కత్తుల కోలాటం ఆడతాం..
బీఆర్‌ఎస్ పాలనలో పోటీపడి దోచుకున్న రాష్ట్రంలో హరీశ్‌రావు వద్దే పైసలు ఎక్కువగా ఉన్నాయని మందుల సామేలు అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా హరీశ్‌రావు మాట వింటారని, కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదని అన్నారు. ‘కడియం పట్ల కౌశిక్‌రెడ్డి తీరు సరిగా లేదు. ఇలాగే ఉంటే కత్తుల కోలాటం ఆడతాం బిడ్డా!’ అని హెచ్చరించారు. కాగా, దళిత సభ్యులను అవహేళన చేస్తున్నారని, కేసీఆర్ నేర్పిన సంస్కారం ఇదేనా? అని వెడ్మ బొజ్జు ప్రశ్నించారు. కడియం పట్ల బీఆర్‌ఎస్ నేతల వాఖ్యలు బాధాకరమని, మేడిపల్లి సత్యం అన్నారు. కౌశిక్‌రెడ్డికి, బీఆర్‌ఎ్‌సకు దళితులను అవమానించడం అలవాటుగా మారిందని కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కౌశిక్‌రెడ్డి అసెంబ్లీ నక్సలైట్‌గా మారారని, ఆయనను బర్తరఫ్ చేయాలని చిక్కుడు వంశీకృష్ణ డిమాండ్ చేశారు. పెద్దలకు ఇచ్చే మర్యాద ఇదేనా? అని యశస్వినిరెడ్డి ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డికి దళితులంటే చిన్న చూపు ఉందని మట్టా రాగమయి అన్నారు. వేముల వీరేశం మాట్లాడుతూ.. దళిత నేతలను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు. హత్య చేస్తామని, హావభావాలు చూపిన వ్యక్తిని సభ నుంచి శాశ్వతంగా పంపేలా సభ్యత్వాన్ని రద్దు చేయాలని అన్నారు.
నిరసనల మధ్య బిల్లులకు ఆమోదం..
ఆదివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే.. బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. హౌస్ కమిటీ వేయాలని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యనే.. తొలుత ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే ఎ.గోవిందనాయక్ మృతికి సభ రెండు నిమిషాల పాటు సంతాపం తెలిపింది. అనంతరం ఐదు బిల్లులను ప్రవేశపెట్టారు. తెలంగాణ వ్యాట్ సవరణ బిల్లు-2026ను, హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లును, ది తెలంగాణ ప్లాట్‌ఫాం బేస్డ్ గిగ్ వర్కర్స్ రిజిస్ర్టేషన్ సొసైటీ, సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బిల్లును, పంచాయతీరాజ్ మూడో సవరణ బిల్లును, తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంట్‌బిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరంటల్ సపోర్టు బిల్లు-2026ను ప్రవేశ పెట్టారు. అన్ని బిల్లులనూ బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళనల మధ్యనే ఆమోదించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన తరువాత కూడా హౌస్ కమిటీ వేయాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేయడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అనధికారిక విక్రయాలు, వక్ఫ్ ఆస్తుల మీద, హౌసింగ్ సహకార సంఘం మీద మూడు హౌస్ కమిటీలు ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్.. ఆ నివేదికలను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎవరు తప్పుచేసినా ఈ ప్రభుత్వం ఉపేక్షించదని, 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అవకతకవలన్నీ విచారణలో వెలుగులోకి వస్తాయని అన్నారు.
బీఆర్‌ఎస్ సభ్యులకు స్పీకర్ హెచ్చరిక..
పదే పదే సభకు అడ్డుపడుతున్న బీఆర్‌ఎస్ సభ్యులను స్పీకర్ ప్రసాద్‌కుమార్ హెచ్చరించారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సభా సంప్రదాయాలను పాటించాలని సూటిగా వార్నింగ్ ఇచ్చారు. కాగా, సభ సజావుగా జరిగేందుకు బీఆర్‌ఎస్ నేతలు అడుగుతున్న హౌస్ కమిటీ వేయాలని, లేదా వారు కోరుతున్న అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ అన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. సీబీసీఐడీ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించాక.. అంతకంటే పెద్ద సంస్థ ఉందా? అని ప్రశ్నించారు. వయోవృద్ధుల బిల్లుపై పాయల్ శంకర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల బాధల పట్ల ఈ సమాజం మానవతా ధృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, హౌస్ కమిటీ వేసినంత మాత్రాన.. బీఆర్‌ఎస్ విజయం సాధించినట్లు కాదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. అలాగని.. ప్రభుత్వం తలొగ్గినట్లు కాదన్నారు. సభను నడవనివ్వకుండా బీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుపడటం సరికాదన్నారు. కాగా, అక్రమాలపై విచారణ జరిపిస్తామన్న ప్రభుత్వ నిర్ణయం నచ్చకపోతే న్యాయస్థానానికి వెళ్లాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. గతంలో బయ్యారం విషయంలో తాను హౌస్ కమిటీ అడిగినా సాధ్యం కాలేదని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు సభకు అడ్డుపడుతున్నందున వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. బాలానగర్ భూదందా పైనా సీఎం హౌస్ కమిటీ వేయాలని కోరారు. బీఆర్‌ఎస్ సభ్యుల బాడీ లాంగ్వేజ్ సరిగా లేదన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో చాలా భూదందాలు జరిగాయని, వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని అన్నారు. తన సొంత భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి అప్పగించారని, నాడు ఏమీ మాట్లాడలేని నిస్సహాయతలో ఉన్నామని తెలిపారు.
గత పదేళ్లు భూ దోపిడీ జరిగింది..
గత పదేళ్ల పాలనలో రాష్ట్రంలో అనేక రకాల భూకబ్జాలు, భూదోపిడీ జరిగాయని కడియం శ్రీహరి అన్నారు. ధరణిని అడ్డుపెట్టుకుని అధికారంలో ఉన్నవారు అడ్డగోలుగా వందల ఎకరాలు కబ్జా చేశారని చెప్పారు. బాలానగర్ భూ దందాపై హౌస్ కమిటీకి స్పీకర్ అనుమతించాలని కోరారు. బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని కూల్చి.. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కాగా, బీజేపీ మాటకు విలువ ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎనిమిది నెలల క్రితం కాళేశ్వరం విచారణను సీబీకి అప్పగిస్తే ఇప్పటివరకు చర్యలు లేవన్నారు. బడ్జెట్ సమావేశాల్లో బీఆర్‌ఎస్ నాయకులు అల్లరి చేయడం సరికాదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. గతంలో మూడు హౌస్ కమిటీలు వేశారని, వాటిని అడ్డుపెట్టుకుని ఇతర పార్టీల నాయకులను బ్లాక్‌మెయిల్ చేసి బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని ఆరోపించారు. వారు అడిగిన పనులు చేయలేదని.. రెవెన్యూ మంత్రిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం విచారణ నివేదికను సీబీఐకి పంపితే 8 నెలలుగా బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి మూడు, నాలుగు లక్షల బిల్లుపై ఇంత రాద్ధాంతం చేస్తున్న బీఆర్‌ఎస్ ఆలోచన సరిగా లేదన్నారు. ఏది చేసినా తామే పెత్తనం చేయాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్
అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ సస్పెన్షన్ విధించారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలంటూ శాసనసభలో ఆందోళనకు దిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ హెచ్చరించినా పట్టించుకోకుండా, సభను కొనసాగించకుండా అడ్డుపడుతున్నారని వారిపై చర్యలకు శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు. ఈ మేరకు సభ్యుల ఆంగీకారంతో బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు రెండు రోజులపాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలన్న తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. కాగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల అవినీతిని ప్రశ్నిస్తే తమను సస్పెండ్ చేస్తారా? అని బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కంపెనీ మైనింగ్ అక్రమాలను, అవినీతిపై ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసిందన్నారు. విచారణకు హౌస్ కమిటీ వేయాలని కోరితే.. కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం దారుణమన్నారు.