సారూ.. నా గోడు వినండి..!
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:59 AM
ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలాన్ని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య ...
రంగారెడ్డి కలెక్టరేట్‌లో కిన్నెర మొగులయ్య ఆవేదన
600 గజాల స్థలంపై ప్రజావాణిలో వినతి
రంగారెడ్డి అర్బన్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలాన్ని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య (కిన్నెర మొగులయ్య) రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన కలెక్టర్ సి.నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. హయత్‌నగర్‌లో ప్రభుత్వం తనకు 600 గజాల నివాస స్థలాన్ని కేటాయించిందని, అందుకు అధికారులంతా సహకరించారని తెలిపారు. స్థలాన్ని కేటాయించి రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు తన పేరిట రిజిస్ట్రేషన్ కాలేదని, దీనికోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నానని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిని త్వరగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేసి, దానిని తన నలుగురు కుమారులకు పంపిణీ చేసేలా చూడాలని కోరారు.