అద్భుత వైద్యంతోనే సేవలకు సార్థకత
ABN , Publish Date - Feb 01 , 2026 | 07:18 AM
ప్రాణాపాయ స్థితిలో రోగులు మన వద్ద (ఆస్పత్రి)కు వస్తారు, వారికి నాణ్యమైన, మెరుగైన చికిత్స అందించి వారు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని...
పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు
హైదరాబాద్ సిటీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రాణాపాయ స్థితిలో రోగులు మన వద్ద (ఆస్పత్రి)కు వస్తారు, వారికి నాణ్యమైన, మెరుగైన చికిత్స అందించి వారు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు అన్నారు. ‘రోగులు తమ శరీరాన్ని, ప్రాణాలనూ మనకు అప్పగిస్తారు. రహస్యాలను సైతం మనల్ని నమ్మి మన చేతుల్లో పెడతారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంటే మంచి భద్రత, వ్యవస్థీకృతమైన సేవలతో, శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాలతో అద్భుతమైన సేవలందించిప్పుడే మనం అందించే సేవలకు సార్థకత ఉంటుందని చెప్పారు. శనివారం హైటెక్ సిటీలోని సింధు ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని సత్కరించారు. ఈ సందర్భంగా సింధు ఆస్పత్రి చైర్మన్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని వరించిన పద్మభూషణ్ పురస్కారం మొత్తం వైద్యరంగానికీ, భారతదేశంలోని డాక్టర్లందరికీ దక్కిన అరుదైన గౌరవమని అన్నారు. డాక్టర్ నోరి తమ సింధు ఆస్పత్రికి ప్రధాన సలహాదారుగా పని చేయడం తమకెంతో గర్వకారణమని అన్నారు.