Share News

ముగ్గురు తెలంగాణ వాసులకు నేడు పద్మ అవార్డుల ప్రదానం

ABN , Publish Date - May 25 , 2026 | 04:43 AM

రాష్ట్రానికి చెందిన ముగ్గురికి సోమవారం ఢిల్లీలో పద్మ అవార్డులు ప్రదానం చేయనున్నారు. హైదరాబాద్‌ మణికొండలో నివాసముంటున్న డాక్టర్‌ గూడూరు వెంకట్రావు...

ముగ్గురు తెలంగాణ వాసులకు నేడు పద్మ అవార్డుల ప్రదానం

  • పురస్కారాలు అందుకోనున్న డాక్టర్లు గూడూరు వెంకట్రావు,పి.విజయ్‌ ఆనంద్‌రెడ్డి, కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెందిన ముగ్గురికి సోమవారం ఢిల్లీలో పద్మ అవార్డులు ప్రదానం చేయనున్నారు. హైదరాబాద్‌ మణికొండలో నివాసముంటున్న డాక్టర్‌ గూడూరు వెంకట్రావు, జూబ్లీహిల్స్‌ వాసులైన దీపికారెడ్డి, డాక్టర్‌ పాలకొండ విజయ్‌ ఆనంద్‌రెడ్డి నేడు పద్మశ్రీ పురస్కారాలు అందుకోనున్నారు. డాక్టర్‌ గూడూరు వెంకట్రావు ప్రముఖ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు. మినిమల్‌ ఇన్వేసివ్‌ సర్జరీ, గ్యాస్ట్రో, లివర్‌, ప్యాంక్రియాస్‌ చికిత్సల్లో నిపుణుడు. 12 వేలకు పైగా శస్త్రచికిత్సలు, 16 వేల ఎండోస్కోపీ ప్రక్రియలు నిర్వహించారు. ఏఐజీ హాస్పిటల్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. హైదరాబాద్‌కు చెందిన దీపికారెడ్డి ప్రసిద్ధ కూచిపూడి నృత్యకారిణి, కొరియోగ్రాఫర్‌గా కూడా పనిచేస్తున్నారు. 5 దశాబ్దాలుగా నృత్యరంగంలో సేవలు అందిస్తున్నారు. దీపాంజలి ఇనిస్టిట్యూట్‌ ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చారు. దేశ, విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. సంగీతోత్సవాలు, రాష్ట్ర, జాతీయ అవార్డులు పొందారు. డాక్టర్‌ పాలకొండ విజయ్‌ ఆనంద్‌రెడ్డి ప్రముఖ క్యాన్సర్‌ నిపుణుడు. అపోలో క్యాన్సర్‌ సెంటర్‌లో సీనియర్‌ డాక్టర్‌. 33 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 15 వేలకు పైగా క్యాన్సర్‌ బాధితులకు చికిత్సలు చేశారు. క్యాన్సర్‌ అవగాహన, చికిత్స అందుబాటుకోసం క్యూర్‌ ఫౌండేషన్‌ స్థాపించారు. ప్రజారోగ్యంపై, ముఖ్యంగా పొగాకు వ్యతిరేక ప్రచారంలో కీలకపాత్ర పోషించారు.

Updated Date - May 25 , 2026 | 04:43 AM