kumaram bheem asifabad- జోరుగా వరినాట్లు
ABN , Publish Date - Aug 02 , 2026 | 10:12 PM
జిల్లాలో వరినాట్లు జోరందు కున్నాయి. వరుస వర్షాలతో సాగుకు ఆటంకాల్లేవని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రుతుపవనాల ఆలస్యం, ఎల్‌నినో ప్రభావంతో జూన్ నెలంతా డీలా పడిన రైతుల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆశలు నింపాయి. వారం రోజుల క్రితం లోటు వర్షపాతం నమోదుకాగా, వరుస వర్షాలు జిల్లాలో పంటల సాగుపై రైతుల్లో ఆశలు పెరుగుతు న్నాయి
- పొలాలు సిద్ధం చేసుకుంటున్న అన్నదాతలు
బెజ్జూరు/కౌటాల, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరినాట్లు జోరందు కున్నాయి. వరుస వర్షాలతో సాగుకు ఆటంకాల్లేవని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రుతుపవనాల ఆలస్యం, ఎల్‌నినో ప్రభావంతో జూన్ నెలంతా డీలా పడిన రైతుల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆశలు నింపాయి. వారం రోజుల క్రితం లోటు వర్షపాతం నమోదుకాగా, వరుస వర్షాలు జిల్లాలో పంటల సాగుపై రైతుల్లో ఆశలు పెరుగుతు న్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా సాగు పనులు ఊపందుకున్నాయి.
56వేల ఎకరాల్లో వరి సాగు..
జిల్లాలో 56వేల ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత వారం క్రితం వరకు సరైన వర్షాలు లేక ఇక సాగు ఆశలు వదులుకోవాల్సిందేనని అనుకున్న రైతుల్లో ఎట్టకేలకు అన్నదాక కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. జిల్లాలో మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వరినాట్లు జోరందుకున్నాయి. జూన్, జూలై నెలలో వర్షాలు లేక రైతులు వరినారు వేసేందుకు భయపడ్డారు. వరినార్లు కూడా ముదిరిపోవడంతో పాటు ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల వైపు వ్యవసాయ అధికారులు మళ్లించే ప్రయత్నాలు చేశారు. జిల్లాస్థా యిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కానీ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు మళ్లీ వరిపంట సాగుపై ఆశలు రేకెత్తించాయి.
- చెరువులకు జలకళ..
ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు వర్షం నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలో 563చెరువులు ఉన్నాయి., ఇందులో 100ఎకరాలకుపైగా ఉన్న చెరువులు 147, 100ఎకరాలలోపు 416చెరువులు ఉన్నాయి. వరుస వర్షాలతో చెరువులు మత్తడి పడుతున్నాయి. అన్ని చెరువులు నీటితో కళకళలాడుతుండడంతో వరిసాగుపై రైతుల్లో ఆశలు చిగురింపజేశాయి. చెరువులు, కుంటలు, వాగుల్లో వర్షం నీరు చేరడంతో భూగర్బజలాలు పెరుగు తున్నాయి. ఏకదాటిగా కురిసిన వర్షాలకు సాగు పనులు జోరందుకోవడంతో రైతన్నల్లో ఆశలు వెల్లువెత్తుతున్నాయి.