Share News

పంట కొనుగోళ్ల కష్టం..కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి ఆత్మహత్యాయత్నం!

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:07 AM

ధాన్యం కొనుగోలు కోసం ఓ వైపు రైతుల నుంచి ఒత్తిడి, మరోవైపు మిల్లర్ల కొర్రీలు, లారీలు సకాలంలో రాకపోతుండటంతో ఆందోళనకు లోనైన కొనుగోలు ...

పంట కొనుగోళ్ల కష్టం..కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి ఆత్మహత్యాయత్నం!

  • కొనుగోలు కేంద్రం నడపటం కష్టంగా మారింది

  • నా ఆత్మహత్యతోనైనా ధాన్యం కాంటా వేగవంతం చేయాలి

  • సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డి మందు తాగిన సైదులు

  • నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం బచ్చన్నగూడెంలో ఘటన

కనగల్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కోసం ఓ వైపు రైతుల నుంచి ఒత్తిడి, మరోవైపు మిల్లర్ల కొర్రీలు, లారీలు సకాలంలో రాకపోతుండటంతో ఆందోళనకు లోనైన కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి ఆత్మహత్యాయత్నం చేశారు. కొనుగోలు కేంద్రం నడపటం కష్టంగా మారిందంటూ, తన చావుతోనైనా కాంటాలు (తూకం) వేగవంతం చేయాలంటూ గడ్డి మందు తాగారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసుకుని వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేశారు. బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం బచ్చన్నగూడెంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.బచ్చన్నగూడెంలో నెల రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశారు. జీ.ఎడవల్లి గ్రామానికి చెందిన పీఏసీఎస్‌ స్టాఫ్‌ అసిస్టెంట్‌ కొప్పుల సైదులు(30) ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ధాన్యం కొనుగోలు నుంచి మిల్లులకు పంపేవరకు బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఆరు గ్రామాలకు చెందిన రైతులు ఈ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువస్తుంటారు. అయితే కొన్నిరోజులుగా సకాలంలో లారీలు కేంద్రానికి రాకపోవటం, మిల్లర్లు తాలు పేరుతో ధాన్యం అన్‌లోడ్‌ చేసుకోవడానికి నిరాకరిస్తుండటంతో.. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. తూకం వేగవంతం చేయాలని మూడు రోజులుగా రైతులు ఒత్తిడి చేస్తుండటంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫలితం లేకపోవడంతో ఆందోళన చెంది బుధవారం సాయంత్రం.. కొనుగోలు కేంద్రం ఎదుటే సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన రైతులు 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం.

Updated Date - Apr 30 , 2026 | 05:07 AM