Share News

ధాన్యానికి రికార్డు ధర

ABN , Publish Date - Aug 14 , 2026 | 06:13 AM

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యానికి క్వింటాకు రాష్ట్రస్థాయిలో అధిక ధర నమోదైంది. అతి సన్న రకాలైన జైశ్రీరాం పాత ధాన్యంకి రూ.4,355 ధర పలకడం విశేషం.

ధాన్యానికి రికార్డు ధర

జైశ్రీరాం పాతరకం క్వింటాకు రూ.4,355

కేసముద్రం మార్కెట్‌లో నమోదు

కేసముద్రం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యానికి క్వింటాకు రాష్ట్రస్థాయిలో అధిక ధర నమోదైంది. అతి సన్న రకాలైన జైశ్రీరాం పాత ధాన్యంకి రూ.4,355 ధర పలకడం విశేషం. ఈ మార్కెట్‌కు గురువారం 48 మంది రైతులు 1,106 బస్తాల్లో ధాన్యం తీసుకురాగా ఎలక్ట్రానిక్ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌) విధానంలోని ‘ఈ-వేలం’లో ధాన్యానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.4,355, కనిష్ఠంగా రూ.2,029, సగటున రూ.3,549 ధరలతో వ్యాపారులు ఖరీదు చేశారు. జైశ్రీరాం పాతరకం ధాన్యానికి ఓ వ్యాపారి క్వింటాకు గరిష్ఠంగా రూ.4,355 ధర నమోదు చేసి దక్కించుకున్నాడు. దీంతో మార్కెట్‌ ఏర్పడిన నాటి నుంచి ధాన్యానికి క్వింటాకు ఈ ధర దక్కడం ఇక్కడ ఒక రికార్డుగా నిలుస్తోంది. జూలై 21న తొలిసారి ఈ రకం ధాన్యానికి క్వింటాకు రూ.4 వేల మార్కు దాటి రూ.4,013 ధర రాగా, అదే నెల 28న రూ.4,036, ఈ నెల 3న రూ.4,135, 4న రూ.4,141 ధరలు నమోదయ్యాయి. ఇదే రకం ధాన్యం గత ఏడాది ఇదే సమయానికి రూ.3,600 నుంచి రూ.3,700 వరకు గరిష్ఠ ధరలతో కొనుగోలు చేశారు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో అన్ని రకాల ధాన్యం ధరలు సాధారణం కంటే క్వింటాకు రూ.500 నుంచి రూ.700 అధికంగా ఉన్నాయి. అసాధారణ రీతిలో ధాన్యం ధర పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, బియ్యం వినియోగదారులు మాత్రం రేట్లు పెరుగుతాయని ఆందోళనతో ఉన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 06:14 AM