బీజేపీ సభ్యత్వమే పౌరసత్వానికి ప్రామాణికమా?
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:25 AM
భారత పౌరసత్వానికి పాస్‌పోర్ట్ ప్రామాణికం కాదంటే మరి బీజేపీ సభ్యత్వం ప్రామాణికమవుతుందా...?’ అని మజ్లిస్ అధినేత...
పాస్‌పోర్టు కూడా రుజువు కాదంటే ఎలా..?
కేంద్రం తీరుపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ‘భారత పౌరసత్వానికి పాస్‌పోర్ట్ ప్రామాణికం కాదంటే మరి బీజేపీ సభ్యత్వం ప్రామాణికమవుతుందా...?’ అని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ‘పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం భారత పౌరులకే పాస్‌పోర్ట్ ఇస్తారు. రెండు దశల్లో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అవుతుంది, పోలీసుల విచారణ అనంతరమే పాస్‌పోర్ట్ జారీ అవుతుంది’ అని గుర్తు చేశారు. గురువారం దారుస్సలాంలో మీడియాతో ఆయన మాట్లాడారు. జనన ధ్రువీకరణ, ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు కూడా ప్రామాణికం కాకపోతే... ఏ పత్రం పౌరసత్వానికి ప్రామాణికం అవుతుందో చెప్పాలని నిలదీశారు. ఇక కేంద్ర ప్రభుత్వం రేపు బీజేపీ సభ్యత్వ కార్డు ఉంటేనే పౌరసత్వం ఉన్నట్లు ప్రకటించినా ఆశ్చర ్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. ఓటర్ జాబితాలో పేరు చేర్చడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన 12 పత్రాల్లో మూడు తెలంగాణలో లేనందు వల్ల.. వాటి స్థానంలో పాన్ కార్డు, ఆహార భద్రత కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఆంగ్లంతో పాటు తెలుగు, ఉర్దూలో ఎన్యుమరేషన్ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్ వల్ల ఓట్ల తొలగింపు జరుగుతుందని రెండు నెలలుగా తాము చెబుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా అప్రమత్తమైందని వ్యాఖ్యానించారు. ‘ఒక బీఎల్‌ఓకు 1,200 ఓటర్లు ఉంటారు. పత్రాలు ఇవ్వడమే కాకుండా తీసుకోవాలి. దీనికి నెల మాత్రమే సమయముంది. యూపీలో రామమందిరంలో నిధుల కుంభకోణానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ ఎప్పుడు నమోదవుతుంది.. నిందితులపై బుల్డోజర్ నడిపిస్తారా..? లేక కాల్పులు జరుపుతారా...? అక్కడ ముస్లింల ఇళ్లపైకి బుల్డోజర్ వెళుతుంది. నేరం నిరూపితం కాకున్నా కాళ్లపై కాల్పులు జరుపుతారు’ అని ఆక్షేపించారు.