Share News

ట్రంప్‌ పిచ్చోడు.. ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాడు

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:52 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చోడిలా మారి... ప్రపంచం మొత్తాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు.

ట్రంప్‌ పిచ్చోడు.. ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాడు

  • హర్మూజ్‌లో భారత నౌకలపై అమెరికా దాడిని ఖండించిన అసదుద్దీన్‌ ఒవైసీ

  • తెలంగాణలో 88 లక్షల మంది ఓటర్లను ‘అనామలీస్‌’ లో పెట్టడంపై అభ్యంతరం

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చోడిలా మారి... ప్రపంచం మొత్తాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. హర్మూజ్‌లో భారతీయ నౌకలపై అమెరికా బలగాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈనెల 25 నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై.. కేంద్ర ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. నాంపల్లిలో వివిధ మత పెద్దలతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కీలక సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రామాణికంగా చూపిస్తున్న 12 పత్రాల్లో మూడు పత్రాలు (శాశ్వత నివాస ధ్రువీకరణ, జాతీయ సిటిజన్‌ రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ), ఫ్యామిలీ రిజిస్టర్‌) తెలంగాణలో లేవని గుర్తు చేశారు. వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న రేషన్‌కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు కేంద్రం ఇచ్చే పాన్‌ కార్డులను ఆమోదించాలని సూచించారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వల్ల పేదలు, ముఖ్యంగా ముస్లింలు, దళితులు తీవ్రంగా ప్రభావితం అవుతారని, కొన్ని శక్తులు కావాలనే వీరి ఓట్లను తొలగించడానికి కుట్ర పన్నాయని ఆరోపించారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న 2.86 లక్షల మంది ఓటర్లలో ఏకంగా 1.79 లక్షల మందిని ‘అనామలీస్‌’ (పొంతన లేని) జాబితాలో ప్రకటించడంపై ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీఎల్‌వోల పేర్లను కూడా జాబితాలో చేర్చారని మండిపడ్డారు. తెలంగాణలో 88 లక్షల మంది అనామలీస్‌ జాబితాలో ఉన్నారని, వీరిలో 62 లక్షల మందిని మళ్లీ చేర్చుతామని ఎన్నికల సంఘం చెబుతోందని.. ఈ తప్పిదాలకు కారకులెవరని ప్రశ్నించారు. మీనాక్షీ నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణపై స్పందిస్తూ భారతీయ న్యాయ సంహిత ప్రకారం.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కానంత వరకు కేసు లేనట్లేనని అభిప్రాయపడ్డారు.

Updated Date - Jun 12 , 2026 | 05:52 AM