అధిక లోడు.. ప్రమాదాలు తోడు
ABN , Publish Date - May 13 , 2026 | 12:08 AM
ఎండాకాలంలో పశువుల గ్రాసం దొరకక పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ట్రాక్టర్లు, లారీల ద్వారా గడ్డి తరలింపు
అధిక లోడుతో వస్తూ అజాగ్రత్త
తీసుకొచ్చే క్రమంలో విద్యుత్ తీగలకు తగిలి దగ్ధం
చండూరు రూరల్, మే 12(ఆంధ్రజ్యోతి): ఎండాకాలంలో పశువుల గ్రాసం దొరకక పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లి పశువుల కోసం రైతులు ట్రాక్టర్లు, లారీల్లో గడ్డి తెస్తుంటారు. గడ్డి కట్టలు కట్టుకుని లారీలు, ట్రాక్టర్లలో లోడు ఎక్కువ ఉన్న క్రమంలో విద్యుత్ వైర్లకు గడ్డి తగిలి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో గడ్డితో పాటు వాహనాలు కూడా పూర్తిగా కాలిపోతున్నాయి. ట్రాక్టర్లు, లారీల్లో పరిమితి మించి గడ్డి కట్టలు వేస్తుంటారు. ఎత్తుగా, పక్కలకు కట్టెల సహాయంతో వెడల్పుగా మరీ పేర్చుకుని వెళ్తుంటారు. ఈ క్రమంలో వాహనదారులు, ద్విచక్రవాహ నదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ట్రాక్టర్ నిండుగా గడ్డి కట్టలు కట్టుకోవడంతో పక్క నుంచి వచ్చే వాహనాలు కనబడక పోవడం, వాటిని దాటే సమయంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంత మంది ట్రాక్టర్ డ్రైవర్లు అవగాహన లేమితో, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న యువకులు ఎత్తైన లోడ్‌ను కంట్రోల్ చేయలేక పడిపోతున్నాయి. దీంతో ఇట్టి గడ్డి ట్రాక్టర్ల పక్కన వెళ్తున్న చిన్న చిన్న వాహనాలు, ద్విచక్ర వాహనాలకు ప్రమాదం పొంచిఉందని వాహనదారులు వాపోతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలో గడ్డి ట్రాక్టర్ ఢీకొని వృద్ధ దంపతులు తీవ్ర గాయాలపాలయ్యారు.
గడ్డిలోడ్ ట్రాక్టర్లు, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గడ్డి లోడ్ ట్రాక్టర్లు ఎక్కువగా రాత్రి వేళల్లో, లేదా తెల్లవారుజామున వెళ్తూ ఉంటాయి. ఆ సమయంలో వాహనదారులు అప్పర్ డిప్పర్ లైట్లు వేసుకుంటూ వెళ్లాలి. గడ్డి ట్రాక్టర్ పూర్తిగా సైడ్ ఇచ్చి ఆగిన తర్వాత వెళ్లాలి. గడ్డిలోడ్ ట్రాక్టర్ రోడ్డ్ సైడ్ దిగే సమయంలో నిధానంగా దించాలి. రాత్రి సమయంలో ట్రాక్టర్ లైట్‌లు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఎదురుగా వచ్చే వాహనాలకు కనిపించే విధంగా అప్పర్‌డిప్పర్ లైట్లు వాడాలి. ట్రాక్టర్‌పై గడ్డిలోడ్ ఉన్న సమయంలో సౌండ్ బాక్స్ అస్సలు వాడకూడదు. ట్రాక్టర్ వెంట ఇద్దరు మనుషులు ముందు వెనక ఉండే విధంగా చూసుకోవాలి. ఎత్తైన లోడ్ చేసుకున్న సమయంలో విద్యుత్ వైర్లు తగలకుండా చూసుకోవాలి.
సామర్థ్యానికి మించి లోడ్‌తో ధాన్యం లారీలు
శాలిగౌరారం, మే 12(ఆంధ్రజ్యోతి): సామర్థ్యానికి మించి ధాన్యం బస్తాలతో లోడ్ చేసిన లారీల కారణంగా గ్రామ రహదారుల్లో విద్యుత్ తీగలు తెగిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. నిర్ణీత ఎత్తుకు మించి ధాన్యం బస్తాలను పేర్చడంతో, రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో విద్యుత్ తీగలకు తగులుతున్నాయి. దీంతో తరచూ లైన్లు తెగిపోవడం, విద్యుత్ స్తంభాలు వంగిపోవడం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. శాలిగౌరారం బస్ స్టేజీ వద్ద ఓవర్ లోడుతో వెళ్తున్న ఒక లారీ కరెంట్ తీగలకు తాకడంతో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోర ుుంది. గ్రామపంచాయతీ నీరు అందించే విద్యుత్ మోటారు కాలిపోయి నష్టం వాటిల్లింది. మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. ఓవర్ లోడ్ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటమే కాకుండా, తీగలు తెగి పడితే ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఓవర్ లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్ణీత ప్రమాణాల మేరకు మాత్రమే లోడ్ అనుమతించాలని గ్రామస్థులు కోరుతున్నారు.