Share News

పెండింగ్‌లో 7,606 రైతు బీమా క్లెయిమ్‌లు

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:25 AM

రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం బకాయిలు పేరుకుపోవడం.. వేలాది రైతు కుటుంబాల పాలిట శాపంగా మారింది. గతంలో ప్రీమియం చెల్లింపులు ఆలస్యమైనా పెండింగ్‌..

పెండింగ్‌లో 7,606 రైతు బీమా క్లెయిమ్‌లు

  • సర్కారు పూర్తి ప్రీమియం చెల్లించకపోవడంతో నిలిపేసిన ఎల్‌ఐసీ

  • 2025-26 సంవత్సరానికి రూ.1,359 కోట్లకు 436 కోట్ల బకాయి

  • అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతులు

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం బకాయిలు పేరుకుపోవడం.. వేలాది రైతు కుటుంబాల పాలిట శాపంగా మారింది. గతంలో ప్రీమియం చెల్లింపులు ఆలస్యమైనా పెండింగ్‌ మొత్తాన్ని వడ్డీతో కలిపి తీసుకుంటూ ఎప్పటికప్పుడు క్లెయిమ్‌లను క్లియర్‌ చేసిన ఎల్‌ఐసీ.. ఈసారి నిబంధనలు మార్చింది. పూర్తి ప్రీమియం చెల్లిస్తేనే క్లెయిమ్‌లు అనుమతిస్తామని స్పష్టం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,606 క్లెయిమ్‌లు పెండింగ్‌లో పడ్డాయి. ఫలితంగా వివిధ కారణాలతో మృత్యువాత పడిన రైతుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పరిహారం కోసం మృతుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2018లో తెచ్చిన ఈ రైతు బీమా పథకం మేరకు.. ప్రమాదవశాత్తు లేదా సహజ కారణాలతో రైతు మరణిస్తే.. నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎల్‌ఐసీకి ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.1,359.56 కోట్లు కాగా.. ఇప్పటివరకు రూ.923.11 కోట్లే చెల్లించింది. ఇంకా రూ.436.45 కోట్ల బకాయి ఉండటంతో ఎల్‌ఐసీ తదుపరి క్లెయిమ్‌లను ప్రాసెస్‌ చేయకుండా ఆపేసిందని అధికారులు చెబుతున్నారు. పెండింగ్‌లో పడ్డ 7,606 క్లెయిమ్‌లకు సంబంధించి రూ.380 కోట్ల బీమా పరిహారం అందించాల్సి ఉందన్నారు. ఇక బీమా పరిహారం కోసం బాధితులు సచివాలయానికి వచ్చి అధికారులను కలుస్తున్న నేపథ్యంలో.. వారు ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

రెండు రోజుల్లో ప్రీమియం చెల్లింపులు..!

రైతు బీమా పెండింగ్‌ ప్రీమియం చెల్లింపునకు సర్కారు సిద్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే చెల్లింపులు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లిస్తే ఆగస్టు 14 నాటికి రూ.195 కోట్ల విలువైన 3,919 క్లెయిమ్‌లను ప్రాసెస్‌ చేసే అవకాశముంటుందని అధికారులు వివరిస్తున్నారు.

Updated Date - Jun 18 , 2026 | 05:26 AM