Share News

Deputy CM Bhatti Vikramarka: గృహజ్యోతి పథకం కింద 52,82,498 కుటుంబాలకు ఉచితవిద్యుత్‌

ABN , Publish Date - Jan 03 , 2026 | 03:32 AM

రాష్ట్రవ్యాప్తంగా గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకం కింద 52,82,498 కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ....

Deputy CM Bhatti Vikramarka: గృహజ్యోతి పథకం కింద 52,82,498 కుటుంబాలకు ఉచితవిద్యుత్‌

  • డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

హైదరాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకం కింద 52,82,498 కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రప్రభుత్వం రూ.3,593 కోట్లకు పైగా నిధులను విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెల్లించిందన్నారు. శుక్రవారం శానసమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ విజయశాంతి అడిగిన ప్రశ్నలకు భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.అలాగే సభ్యుడు ఏవిఎన్‌ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. తమ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీనే వేతనాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. రూ.200 కోట్ల మెడికల్‌ బిల్లుల బకాయిలను చెల్లించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో యూరియా కొరత లేదు: తుమ్మల

రాష్ట్రంలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు అవసరమైన మేర సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్థంగా ఉందని మంత్రి తుమ్మల చెప్పారు. ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, దాసోజు శ్రవణ్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అడిగిన మరోప్రశ్నకు సమాధానం చెబుతూ.. గత ఆగస్టు, అక్టోబరు మాసాల్లో వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు 24 కోట్లకుపైగా పరిహారం చెల్లించేందుకు నిధులు మంజూరైనట్టు పేర్కొన్నారు.

బలహీనవర్గాలకు సంక్షేమానికి పెద్ద పీట: పొన్నం

బలహీనవర్గాల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం అన్నారు. కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, విద్య, నైపుణ్య శిక్షణ, తదితర అభివృద్ధి కార్యక్రమాలకు కొరత లేకుండా నిధులు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. సభ్యుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.


కాలుష్యకారక కంపెనీలపై చర్యలు: సురేఖ

నిబంధనలు ఉల్లంఘించిన కాలుష్య కారకమైన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎనిమిది ఫార్మా పరిశ్రమల మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసిందని మంత్రి సురేఖ తెలిపారు. చౌటుప్పల్‌ పరిసరాల్లో పారిశ్రామిక కాలుష్యంతో ఉత్పన్నమవుతున్న సమస్యలపై సీపీఐ సభ్యుడు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.చౌటుప్పల్‌లో 12 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని తెలిపారు.

జర్నలిస్టుల అక్రిడిటేషన్లను కుదించొద్దు

జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్‌ కార్డుల సంఖ్య ను కుదించవద్దని సభ్యులు ఎల్‌.రమణ, యాదవరెడ్డిలు డిమాండ్‌ చేశారు. గ్రామపంచాయితీల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి కోరారు. మండలిలో ప్రత్యేక ప్రస్తావన కింద వాణిదేవి మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుపర్చాలని విన్నవించారు. మనబడి, మన ఊరు కింద పాఠశాల భవనాల మరమ్మతుల కింద రూ.360 కోట్ల బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యుడు అంజిరెడ్డి కోరారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించాలని తీన్మార్‌ మల్లన్న డిమాండ్‌ చేశారు. సంచార జాతులను ప్రోత్సహించాలని గోరటి వెంకన్న కోరారు.

Updated Date - Jan 03 , 2026 | 03:32 AM