Share News

27,712 మంది టీచర్లు టెట్‌ తప్పారు

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:32 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు హాజరైన ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 27,712 మంది అర్హత సాధించలేదు. గత నెలలో జరిగిన ఈ పరీక్షకు 65,605 మంది ప్రభుత్వ టీచర్లు హాజరయ్యారు.

27,712 మంది టీచర్లు టెట్‌ తప్పారు

  • హాజరైన టీచర్లు 65,605 మంది

  • గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లో అర్హత 50శాతంలోపే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు హాజరైన ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 27,712 మంది అర్హత సాధించలేదు. గత నెలలో జరిగిన ఈ పరీక్షకు 65,605 మంది ప్రభుత్వ టీచర్లు హాజరయ్యారు. వీరిలో 37,803 మంది ఉపాధ్యాయులు మాత్రమే అర్హత సాధించారు. టెట్‌ ప్రవేశపెట్టకముందు నియమితులై, ప్రస్తుతం ఐదేళ్లకు మించి సర్వీసు ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండేళ్లలోపు తప్పనిసరిగా టెట్‌ రాసి.. అర్హత సాధించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేదంటే సదరు ఉపాధ్యాయులు తమ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు గత ఏడాది సెప్టెంబరులో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా టెట్‌ ఫలితాల్లో పరీక్ష రాసిన ప్రభుత్వ టీచర్లలో 42.24శాతం మంది అర్హత సాధించలేకపోయారు. అందునా.. గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిుక శాస్త్రం సబ్జెక్టులు బోధించే టీచర్లయితే 50 శాతం కూడా అర్హత సాధించలేకపోయారు. పరీక్షకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతరులు కలిపి మొత్తంగా 1,95,181 మంది హాజరయ్యారు. వీరిలో 100270 మంది అర్హత సాధించారు. ఆ మేరకు మొత్తంగా టెట్‌ అర్హత శాతం 51.37శాతంగా నమోదైంది. గత జనవరిలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ మంగళవారం విడుదల చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో పేపర్‌-1కు 25,387 మంది పరీక్ష రాయగా 19,557 (77.03ు) మంది అర్హత సాధించారు. గణితం, సామాన్యశాస్త్రానికి సంబంధించిన పేపర్‌-2 పరీక్షకు 23,293 మంది హాజరవగా 11,444 (49.13ు) మాత్రమే అర్హత సాధించారు. సాంఘిక శాస్త్రం పేపర్‌-3లో 16,925 మంది ఉపాధ్యాయుల్లో 6,892 (40.72ు) మంది అర్హత సాధించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అర్హత సాధించలేకపోయిన ఉపాధ్యాయులు మరో ఏడాదిన్నరలో మూడుసార్లు నిర్వహించనున్న టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది.

Updated Date - Feb 11 , 2026 | 02:32 AM