Share News

15,00,000 రాష్ట్రవ్యాప్తంగా డెలివరీ పెండింగ్‌లో ఉన్న సిలిండర్ల సంఖ్య ఇదీ..

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:23 AM

రాష్ట్రంలో 15లక్షలపైగా సిలిండర్ల డెలివరీ పెండింగ్‌లో ఉంది. వీటి సరఫరాకు వారంపైనే పట్టే అవకాశం కనిపిస్తోంది. ఒక వైపు ‘లాక్‌’ సిస్టమ్‌, మరోవైపు సాఫ్ట్‌వేర్‌ చిక్కులతో గ్యాస్‌ బుకింగ్‌ల సంఖ్య భారీగా తగ్గిపోయినా...

15,00,000 రాష్ట్రవ్యాప్తంగా డెలివరీ పెండింగ్‌లో ఉన్న సిలిండర్ల సంఖ్య ఇదీ..

  • ‘లాక్‌’తో గణనీయంగా తగ్గిన గ్యాస్‌ బుకింగ్‌లు

  • నెల దాటుతున్నా.. కొలిక్కి రాని సరఫరా వ్యవస్థ

  • బుకింగ్‌లోనూ వినియోగదారులకు ఇబ్బందులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 15లక్షలపైగా సిలిండర్ల డెలివరీ పెండింగ్‌లో ఉంది. వీటి సరఫరాకు వారంపైనే పట్టే అవకాశం కనిపిస్తోంది. ఒక వైపు ‘లాక్‌’ సిస్టమ్‌, మరోవైపు సాఫ్ట్‌వేర్‌ చిక్కులతో గ్యాస్‌ బుకింగ్‌ల సంఖ్య భారీగా తగ్గిపోయినా... సరఫరా వ్యవస్థ మెరుగుపడకపోవడం వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. బుక్‌ చేశాక.. వినియోగదారుడి ఇంటికి సిలిండర్‌ చేరడానికి తక్కువలో తక్కువగా రెండు నుంచి మూడు వారాలు పడుతోంది. డోర్‌ డెలివరీ ఆలస్యం అవుతుండటంతో వినియోగదారులు ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 1.30 కోట్ల గృహ వినియోగ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల రోజువారీ బుకింగ్‌లు ఉంటాయి. రోజుకు ఐవోసీఎల్‌ 93 వేలు, హెచ్‌పీసీఎల్‌ 75 వేలు, బీపీసీఎల్‌ 47 వేల చొప్పున గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తుంటాయి. యుద్ధం ప్రారంభం కాకముందు సాధారణ రోజుల్లో రాష్ట్రంలో రోజూ వారీగా 3.50 లక్షల పెండింగ్‌ బిల్లులు(బుకింగ్‌) ఉండేవి. అందులో 2.15 లక్షల సిలిండర్లు సరఫరా చేసేవారు. మిగిలినవి మరుసటి రోజున డెలివరీ చేసేవారు. కానీ, ఇప్పుడు పెండింగ్‌ బుకింగ్‌ల సంఖ్య 15 లక్షలకు పెరిగింది. అంటే ఇవి డెలివరీ కావడానికి 7-8 రోజుల సమయం పడుతుంది. ఆలోపు కొత్త బుకింగ్‌ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. గత వారం రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ సమీక్ష చేసేనాటికి 17 లక్షల పెండింగ్‌ బుకింగ్‌లు ఉన్నాయి. వారం రోజుల్లో 2 లక్షలు తగ్గాయి. ఇప్పటికీ 15 లక్షలు పెండింగ్‌ ఉన్నాయి. సిలిండర్ల డెలివరీ వేగవంతం చేస్తే ఈ సంఖ్య కాస్త తగ్గుతుంది. వాస్తవానికి యుద్ధం ప్రభావంతో తొలి వారం, పది రోజులు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడే ఆందోళనతో బుకింగ్‌లు ఎక్కువ అయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ‘సిస్టమ్‌ లాక్‌’ పద్ధతిని అమలులోకి తీసుకొచ్చింది. రీఫిల్‌ నుంచి రీఫిల్‌ బుకింగ్‌ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో సింగిల్‌ సిలిండర్‌ ఉంటే... 25 రోజులు, డబుల్‌ సిలిండర్లు ఉన్నవారికి 35 రోజుల లాక్‌ పెట్టింది. ఈ లాక్‌ టైమ్‌ అయిపోయిన తర్వాతే మళ్లీ సిలిండర్‌ బుక్‌ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసింది. గతంలో ఈ రోజు ఒక సిలిండర్‌ బుక్‌చేసి... మళ్లీ రేపు ఒక సిలిండర్‌ బుక్‌ చేస్తే సాఫ్ట్‌వేర్‌ తీసుకునేది. ఇప్పుడు అలా తీసుకోవడం లేదు. బుకింగ్‌ చేసిన తర్వాత కూడా... సిలిండర్‌ డెలివరీ చేసిన రోజులపైనే గడువు ఆధారపడి ఉంటుంది. డెలివరీ అయిన రోజు నుంచే మళ్లీ లెక్క పెడుతున్నారు. ఒక ఏజెన్సీ 10 రోజుల్లో సిలిండర్‌ డెలివరీ చేస్తే... 45 రోజులకు 10 రోజులు కలిపి 55 రోజులు అవుతుంది. మరొక ఏజెన్సీ 15 రోజులకు డెలివరీ ఇస్తే 45 రోజులకు 15 రోజులు కలిపి 60 రోజులు పడుతుంది. అంటే రెండు నెలలు సిలిండర్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. రాష్ట్రంలో సింగిల్‌ సిలిండర్‌ కనెక్షన్లు 38 నుంచి 40 శాతం ఉన్నాయి. డెలివరీ కోసం రోజులు తరబడి ఎదురుచూడడం.. వీరికి కష్టతరంగా మారింది.


క్షేత్రస్థాయిలో డెలివరీ కష్టాలు

సిలిండర్లు డోర్‌ డెలివరీ చేయడానికి కూడా క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక ఏరియాకు కనీసం 25- 30 బుకింగ్‌ సిలిండర్లు ఉంటేనే డెలివరీ బాయ్స్‌ వెళ్తున్నారు. 10-15 బిల్లులు ఉంటే... గిట్టుబాటు కాదని వెళ్లడం లేదు. ఉదాహరణకు కీసర ప్రాంతంలో ఉన్న ఒక గ్యాస్‌ ఏజెన్సీ రూరల్‌ పరిధిలో ఉండడంతో బుకింగ్‌లు తక్కువగా ఉన్నాయి. దీంతో గ్యాస్‌ డెలివరీ బాయ్‌లు ప్రతి రోజూ వెళ్లటానికి మొగ్గుచూపడం లేదు. మరోవైపు.. ఇప్పుడు ఓటీపీ విధానాన్ని పక్కాగా అమలుచేస్తున్నారు. గతంలో ఓటీపీ లేకున్నా కూడా ఇచ్చేవారు. ఇప్పుడు 95 శాతం ఓటీపీ విధానం తప్పనిసరి చేశారు. ఒక వేళ 90 శాతం కంటే ఓటీపీల నమోదు తగ్గితే సిస్టమ్‌ లాక్‌ అయిపోతుంది. ఇదిలాఉండగా చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నచోట వంట గ్యాస్‌ డెలివరీ ఆలస్యం అవుతోంది. వీరికి రోజుకు 10- 20 సిలిండర్‌ బిల్లులు మాత్రమే జనరేట్‌ అవుతాయి. దీంతో రవాణా, వేతనాలు వంటి సమస్యలు వస్తున్నాయి.

ఇండేన్‌ను వేధిస్తున్న సాఫ్ట్‌వేర్‌ సమస్య

కొన్నాళ్లుగా ఇండియన్‌ ఆయిల్‌(ఐవోసీఎల్‌) సాఫ్ట్‌వేర్‌ మొరాయిస్తోంది. బుకింగ్‌లు సక్రమంగా కావడం లేదు. ఒకవేళ బుకింగ్‌లు తీసుకున్నా... సకాలంలో డెలివరీలు ఇవ్వడం లేదు. దీంతో రెండు నుంచి మూడు వారాలు సిలిండర్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. భారత్‌, హెచ్‌పీ కంపెనీలు 10- 12 రోజుల్లోనే సిలిండర్‌ను డెలివరీ చేస్తున్నాయి. జనసాంద్రత, డిమాండ్‌ ఎక్కువ ఉన్న చోట మాత్రం సరఫరా ఆలస్యం అవుతోంది. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ నుంచి సమస్యలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో (పీక్‌ హవర్స్‌లో) వినియోగదారులు ఎక్కువ బుకింగ్స్‌ చేసున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఏకకాలంలో బుకింగ్‌ చేయడంతోనే సమస్యలు వస్తున్నాయని ఐవోసీఎల్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

వినియోగదారులు ఏజెన్సీల వద్దకు వెళ్లొద్దు

రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్‌ కొరత లేదు. చిన్న చిన్న సమస్యలతో బుకింగ్‌, డెలివరీ సమస్యలు ఆలస్యం అవుతున్నాయి. ప్రస్తుతం వారం రోజుల్లోపే గ్యాస్‌ సరఫరా చేస్తున్నాం. పెండింగ్‌ బిల్లుల సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిస్తున్నాం. వారం, పది రోజుల్లో పరిస్థితి పూర్తిగా అదు పులోకి వస్తుంది. వినియోగదారులు ఆందోళనతో ఏజెన్సీల వద్దకు వెళ్తున్నారు. అలా వెళ్లాల్సిన అవసరం లేదు. బుకింగ్‌ చేసిన ప్రతి ఒక్కరికి సిలిండర్‌ డోర్‌ డెలివరీ అవుతుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. అవసరం ఉంటేనే సిలిండర్‌ కోసం బుకింగ్‌ చేయాలి.

- జగన్మోహన్‌రెడ్డి, ఎల్పీజీ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - Apr 03 , 2026 | 05:23 AM