Share News

రైతుల ఖాతాల్లో లక్ష కోట్లు!

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:07 AM

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని సాహసం తెలంగాణలో చేశామని, రెండేళ్లలో వివిధ పథకాల కింద రూ.లక్ష కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.

రైతుల ఖాతాల్లో లక్ష కోట్లు!

  • 20 వేల కోట్లకు పైగా రుణమాఫీ చెల్లించాం

  • విపక్షాలు మరెక్కడా మాట్లాడొద్దు: తుమ్మల

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని సాహసం తెలంగాణలో చేశామని, రెండేళ్లలో వివిధ పథకాల కింద రూ.లక్ష కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో వ్యవసాయశాఖ బడ్జెట్‌ ఆమోదం సందర్భంగా ఆయన మాట్లాడారు. రుణమాఫీ జరగలేదంటూ విపక్షాలు విమర్శలు చేయడం తగదని, తమ హామీ మేరకు రైతులకు రుణమాఫీ చెల్లింపులు చేశామని అన్నారు. రూ.2 లక్షలలోపు పంటరుణాలు ఉన్నవారికి మాఫీ వర్తింపజేశామని చెప్పారు. అర్హులైన 25 లక్షల రైతుల ఖాతాలకు రూ.20 వేల కోట్లకు పైగా సొమ్మును జమ చేశామన్నారు. ఇకపై విపక్షాలు మరెక్కడా రుణమాఫీపై మాట్లాడొద్దని సూచించారు. కాగా, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెంచుతున్నారంటూ సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదాయం పెంచుకోవాలని, ప్రజలను తాగుబోతులను చేసి.. వారి సంసారాలను కూల్చాలన్న ఆలోచన తాము చేయడం లేదన్నారు. గత ప్రభుత్వమే ఇలాంటివి చేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో.. గులాబీ కండువా కప్పుకొన్న వారికే దళితబంధు ఇచ్చారని సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయాలకతీతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.


పంటల మార్పిడిని ప్రోత్సహించాలి: తుమ్మల

రాష్ట్రంలో పంటల మార్పిడిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు అధిక ఆదాయం వచ్చే పంటలు, నష్టం వాటిల్లని పంటలను సాగు చేయించేలా చూడాలన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఆయిల్‌పామ్‌ సాగు.. రైతులకు ఆదాయం తెచ్చే పంట అని, రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగుకు అవకాశం ఉందని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు బాలునాయక్‌, కసిరెడ్డి నారాయణరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటల అధ్యయనం జరుగుతోందని, నివేదిక రాగానే వారికి న్యాయం చేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.500 కోట్లతో 5లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో 126 గోదాములు నిర్మించామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో మరో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మించేలా లక్యాన్ని నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80.54 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యంతో 1,377 గోదాములు ఉన్నాయని వెల్లడించారు. మార్కెటింగ్‌ శాఖలో ఇప్పటివరకు రూ.116 కోట్లు ఖర్చు చేశామని, ప్రస్తుత సీజన్‌ కోసం సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ సీజన్‌ కోసం ఇప్పటికే 2,63,675 టార్ఫాలిన్‌లు అందుబాటులో ఉండగా, మరో 60,771 టార్ఫాలిన్‌లు ఆర్డర్‌ చేశామని, ఎలకా్ట్రనిక్‌ వెయుంగ్‌ స్కేల్స్‌ 15,518 అందుబాటులో ఉండగా, మరో 2,989 ఆర్డర్‌ ఇచ్చామని, ప్యాడీ క్లీనర్లు, మొబైల్‌ గ్రెయిన్‌ డ్రైయర్లు సహా మరికొన్ని వస్తువులను ఆర్డర్‌ చేశామన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 05:07 AM