kumaram bheem asifabad- అందని బకాయిలు
ABN , Publish Date - Jul 12 , 2026 | 10:22 PM
ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు సమస్య పెను భారంగా మారింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేస్తే తమకు ఆర్థిక భారం తప్పుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా కళాశాలల కరస్పాండెంట్లు చెబుతున్నారు.
- సర్కారు చర్యలు తీసుకోవాలని వినతి
కాగజ్‌నగర్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు సమస్య పెను భారంగా మారింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేస్తే తమకు ఆర్థిక భారం తప్పుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా కళాశాలల కరస్పాండెంట్లు చెబుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంటు నిధులు పూర్తి స్థాయిలో అంద లేదు. దీంతో విద్యార్థులు దశల వారీగా పోరాటం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించక పోతే తాము తమ కళాశాలను కొనసాగించే పరిస్థితి లేదని యాజమాన్యాలు ఎనిమిది నెలల క్రితం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దశల వారీ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చి కొంత మేర నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం కుమురం భీం జిల్లాలో రూ.1.50 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఫీజు రీయింబ ర్స్‌మెంట్ నేరుగా కళాశాలల్లో మేనేజ్‌మెంటు ఖాతాల్లో జమ చేసే వారు. ప్రస్తుతం కొత్త నిబంధనలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదీ అమలు జరిగితే పాత బకాయిల పరిస్థితి ఎంటీ..? తమకు బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తుండడంతో తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే అవకాశాలున్నాయని డిగ్రీ కళాశాల నిర్వహకులు చెబుతున్నారు. ఒక వైపు విద్యార్థుల చదువులు పూర్తి అవుతుండడం, మరో వైపు బకాయిలు రాక పోవడంతో డబ్బులు ఎవరిని అడుగాలని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విద్యా సంవత్సర ఆరంభంలోనే ఈ ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేస్తే బాగుటుందని ఆయా డిగ్రీ కళాశాలల నిర్వహకులు కోరుతున్నారు.
బకాయిలు విడుదల కాలేదు..
-కుడిక్యాల రాజమౌళి, ప్రైవేట కళాశాలల యాజమాన్యం సంఘం నాయకుడు
విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటు 2021 నుంచి విడుదల కాలేదు. ప్రైవేటు కళాశాలల యాజమానులు ఏడాది క్రితం దశల వారీగా ఆందోళనలు చేపట్టారు. దీంతో 2021 నుంచి రావాల్సిన బకాయిల్లో కొంత మేర ప్రభుత్వం చెల్లించింది. కానీ మిగితా బకాయిలు అలాగే ఉంది. ఈ విషయంలో పలుమార్లు లేఖలు రాసినప్పటికీ కూడా ఇంత వరకు పురోగతి లేదు. ఇప్పటికైనా పూర్తి బకాయిలు చెల్లించాలి.
ప్రభుత్వం స్పందించాలి..
- అన్నం నాగర్జున, ఉస్మానియా జేఏసీ నాయకుడు
విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటు విషయంలో ప్రభుత్వం స్పందించాలి. వెంటనే బకాయిలను విడుదల చేయాలి. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యార్థులకు వివిధ అవసరాలుంటాయి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయరాదు. బకాయిల వెంటనే విడుదల చేయాలని. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ప్రారంభిస్తాం.