బల్దియా ఔట్‌సోర్సింగ్ కార్మికుల ధర్నా
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:21 AM
జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని వివిధ మునిసిపాలిటీల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు తమ సర్వీసులను పర్మినెంట్ చేయాలని ఇందిరా పార్కు వద్ద సోమవారం ధర్నా చేశారు.
వారి సర్వీసులను పర్మినెంట్ చేయాలి: కూనంనేని డిమాండ్
కవాడిగూడ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని వివిధ మునిసిపాలిటీల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు తమ సర్వీసులను పర్మినెంట్ చేయాలని ఇందిరా పార్కు వద్ద సోమవారం ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ వర్కర్స్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నానుద్దేశించి సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ, మునిసిపాలిటీల్లోని పర్మినెంట్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 4డీఏలను తక్షణం విడుదల చేసి పీఆర్‌సీ ప్రకటించాలని కూనంనేని పేర్కొన్నారు. ఏడేళ్లుగా వేతనాలు పెంచక కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 11వ పీఆర్‌సీ గడువు గతేడాది జూలైతోనే ముగిసిందన్న కూనంనేని.. ఆ కమిటీ ఏం సిఫారసు చేసిందో తెలియదన్నారు. వెంటనే వేతన సవరణ జరగాలని, అంత వరకూ ఒక్కో కార్మికుడికి తాత్కాలిక భృతి కింద రూ.4,000 చెల్లించాలని చెప్పారు. 60 ఏళ్లు దాటిన కార్మికుల వారసులకు ఉద్యోగాలివ్వాలన్నారు.