ఔటర్‌పై ప్రమాదం.. నలుగురికి గాయాలు
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:31 AM
రంగారెడ్డి జిల్లా మంచి రేవుల సమీపాన ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూతుళ్లకు గాయాలయ్యాయి.
క్షతగాత్రుల్లో మాజీ ఎమ్మెల్యే మాగంటి కూతుళ్లు
గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తప్పిన ప్రాణాపాయం
నార్సింగ్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మంచి రేవుల సమీపాన ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూతుళ్లకు గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. గోపినాథ్ కూతుళ్లలో అక్షిరానాగ (23)కు తీవ్రగాయాలు కాగా, దిశిరా (19) వారి స్నేహితులు అరికెపూడి దుర్గసాయి (20), మేడిపల్లి అభిరామ్ (21)లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలపాలైన అక్షిరానాగ ప్రాణాపాయం నుంచి బయట పడినట్లు సమాచారం. మిగతా ముగ్గురి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసింది. విదేశాలకు వెళుతున్న స్నేహితుడికి శంషాబాద్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికి ఫార్చూనర్ కారులో గచ్చిబౌలికి బయలు దేరారు. ఔటర్ రింగ్‌రోడ్డుపైకి వస్తున్నప్పుడు ముందు వెళుతున్న డీసీఎం లారీ మరమ్మత్తుకు గురి కావడంతో దాని డ్రైవర్ అకస్మాత్తుగా వేగం తగ్గించాడు. దీంతో వేగంగా వస్తున్న ఫార్చూనర్ కారు వెనుక నుంచి డీసీఎంను బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ సమాచారం అందుకోగానే ఘటనాస్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు.. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.