మోకాళ్లపై ఒత్తిడిని కనిపెట్టే పరికరం
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:44 AM
మోకాళ్లపై పడే ఒత్తిడిని క్షణక్షణం అంచనా వేసి, కీళ్ల సమస్యలను ముందుగానే గుర్తించే సరికొత్త సాంకేతికతను ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు అభివృద్ధి చేశారు.
ఓయూ విద్యార్థుల ఆవిష్కరణ
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 13(ఆంధ్రజ్యోతి): మోకాళ్లపై పడే ఒత్తిడిని క్షణక్షణం అంచనా వేసి, కీళ్ల సమస్యలను ముందుగానే గుర్తించే సరికొత్త సాంకేతికతను ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు అభివృద్ధి చేశారు. ఆర్థరైటిస్, లిగమెంట్ గాయాలు, క్రీడాకారుల్లో మోకాలి సమస్యల నివారణకు ఈ పరికరం దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఓయూ బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఠాకూర్ వైభవ్ సింగ్, అడుసుమిల్లి మన్మయి తమ అధ్యాపకుడు డాక్టర్ కెఈసీహెచ్. విద్యాసాగర్ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ పరికరం శరీర కదలికలను విశ్లేషించి మోకాళ్లపై పడే ఒత్తిడిని గుర్తిస్తుంది. నడక, పరుగు, మెట్లు ఎక్కడం వంటి సాధారణ కార్యకలాపాల సమయంలో కీళ్లపై ఎంత భారం పడుతుందో తెలియజేస్తుంది. ఈ వ్యవస్థలో ఐదు సెన్సర్లు ఉంటాయి. ఒకటి నడుము వద్ద, నాలుగు తొడలు, మోకాళ్ల దిగువన అమరుస్తారు. ఇవి కదలికలు, వేగం, భ్రమణాల సమాచారాన్ని సేకరిస్తాయి. సాధారణంగా నడిచేటప్పుడు మోకాళ్లపై శరీర బరువుకు మూడింతల వరకు ఒత్తిడి పడుతుందని వివరించారు. అధిక ఒత్తిడికి కారణమయ్యే కదలికలను ముందుగానే గుర్తించడం ద్వారా కీళ్ల దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.