గెలాక్సీని కుదిపేస్తున్న ‘మహా కాస్మిక్ గాలులు’
ABN , Publish Date - May 29 , 2026 | 04:00 AM
విశ్వరహస్యాలను ఛేదించే దిశగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఖగోళశాస్త్ర విభా గం శాస్త్రవేత్తలు మరో సంచలన ఆవిష్కరణ చేశారు. మన భూమికి కోట్లాది కాంతి సంవత్సరాల దూరంలో...
భూమికి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఐఆర్‌ఏఎస్ ఎఫ్12397+3333 పాలపుంత
దాంట్లోని ఒక భారీ కృష్ణబిలం నుంచి సెకనుకు 45 వేల నుంచి 80వేల కి.మీ. వేగంతో గాలులు
ఉస్మానియా శాస్త్రజ్ఞుల అధ్యయనంలో వెల్లడి
అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురణకు ఆమోదం
ఉస్మానియా యూనివర్సిటీ, మే 28 (ఆంధ్రజ్యోతి): విశ్వరహస్యాలను ఛేదించే దిశగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఖగోళశాస్త్ర విభా గం శాస్త్రవేత్తలు మరో సంచలన ఆవిష్కరణ చేశారు. మన భూమికి కోట్లాది కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఐఆర్‌ఏఎస్ ఎఫ్ 12397+ 3333 అనే క్రియాశీల గెలాక్సీ కేంద్రంలో ఉన్న ఒక కృష్ణబిలాన్ని వారు గుర్తించారు. అదో సూపర్ మాసివ్ బ్లాక్‌హోల్. మహా గురుత్వాకర్షణశక్తి గల ఆ కృష్ణబిలం తన చుట్టుపక్కల ఉన్న పదార్థాన్ని అత్యంత వేగంగా మింగేస్తోందని.. ఆ సమయంలో అక్కడి వాయువులు వేడెక్కి అత్యంత వేగవంతమైన ఎక్స్‌రేలను విడుదల చేస్తున్నాయని గుర్తించారు. దీనివల్ల అక్కడ ఏర్పడే ‘అలా్ట్రఫాస్ట్ అవుట్ ఫ్లోస్’.. అంటే సెకనుకు 45 వేల కిలోమీటర్ల నుంచి 80 వేల కిలోమీటర్ల వేగంతో వీచే భీకర కాస్మిక్ గాలులు ఆ గెలాక్సీని కుదిపేస్తున్నాయని ఓయూ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఆ గాలుల వేగం కాంతి వేగంలో దాదాపు 15ు నుంచి 30 శాతం!! బ్లాక్‌హోల్స్‌కు సంబంధించి చరిత్రలో ఇప్పటిదాకా గుర్తించిన అత్యంత వేగవంతమైన గాలుల్లో ఇవి కూడా ఒకటి. అయితే, ఒక దశలో స్పష్టంగా కనిపించిన ఈ గాలులు, కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన మరో పరిశీలనలో పూర్తిగా అదృశ్యమయ్యాయి. బ్లాక్‌హోల్ పదార్థాన్ని మింగే వేగంలో వచ్చిన మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ గాలులు గెలాక్సీల్లోని వాయువులను తొలగించేంత శక్తివంతంగా ఉండి, కొత్త నక్షత్రాల ఏర్పాటుపై కూడా ప్రభావం చూపగలవని వారు తెలిపారు. గెలాక్సీల పరిణామ క్రమాన్ని ప్రభావితం చేేస శక్తులు ఎలా పనిచేస్తాయన్న దానిపై ఈ అధ్యయనం కొత్త దారులు చూపిస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఓయూ ఖగోళ శాస్త్ర విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.శ్రీరామ్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ అంతర్జాతీయ శాస్ర్తీయ జర్నల్ ‘ది ఆస్ర్టోఫిజికల్ జర్నల్’లో ప్రచురణకు ఆమోదం పొందాయి.