ఒత్తిడితో ఉస్మానియా వైద్య విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:04 AM
ఒత్తిడిని తట్టుకోలేక ఓ వైద్య విద్యార్థి తనువు చాలించాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న కొల్కూరి భరద్వాజ్ (18) నిర్మాణంలో..
ఉప్పల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఒత్తిడిని తట్టుకోలేక ఓ వైద్య విద్యార్థి తనువు చాలించాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న కొల్కూరి భరద్వాజ్ (18) నిర్మాణంలో ఉన్న ఓ హైరేజ్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగింది. మెదక్ జిల్లా మాసాయిపేట్ గ్రామానికి చెందిన భరద్వాజ్, అతని సోదరి వరేణ్య రామంతాపుర్‌లోని తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. శనివారం అర్ధరాత్రి 1.30వరకు ఇద్దరు కలిసి చదువుకున్నారు. అర్ధరాత్రి దాటాక తన సోదరికి మెలకువ వచ్చి చూసే సరికి భరద్వాజ్ ఇంట్లో లేకపోవడంతో స్నేహితులకు ఫోన్ చేసి అడిగినా ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం తెల్లవారుజామున 7గంటలకు అతని సోదరి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరీక్షల కారణంగా భరద్వాజ్ నాలుగు రోజులుగా ఒత్తిడికి లోనవుతున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. ఫిర్యాదు అందిన కొద్దిసేపటికే ఉప్పల్ క్రికెట్ స్టేడియం పక్కనే ఉన్న ఓ హైరేజ్ భవనం పైనుంచి దూకి యువకుడు మృతి చెందాడని పోలీసులుకు సమాచారం అందింది. ఆ యువకుడు భరద్వాజ్‌గా గుర్తించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.