ఉస్మానియా ఆస్పత్రిలో22 నెలల బాలుడికి కాలేయ మార్పిడి
ABN , Publish Date - May 01 , 2026 | 05:10 AM
జన్యుపరంగా అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న 22 నెలల బాలుడికి ఉస్మానియా వైద్యులు కొత్త జీవితాన్నిచ్చారు. ఆస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు ...
పద్నాలుగు గంటల పాటు మార్పిడి ప్రక్రియ
దేశంలో ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ చికిత్స చేయడం ఇదే తొలిసారి
ఉస్మానియా గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం సిబ్బందిని
అభినందించిన మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్ సిటీ/అఫ్జల్‌గంజ్, మంగళ్‌హాట్ ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): జన్యుపరంగా అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న 22 నెలల బాలుడికి ఉస్మానియా వైద్యులు కొత్త జీవితాన్నిచ్చారు. ఆస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు ఆ చిన్నారికి కాలేయ మార్పిడి చేసి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు. బాలుడి తండ్రి కాలేయం నుంచి కొంత భాగాన్ని తీసుకుని దాన్ని అతడికి అమర్చారు. ఈ శస్త్రచికిత్స వివరాలను ఉస్మానియా వైద్యులు గురువారం తెలిపారు. పాతబస్తీ పరిధిలోని ఉడమ్‌గడ్డకు చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్, సాజియా ఖాతూన్ కుమారుడు మహ్మద్ అఫాన్ కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అధిక ఆకలి, పొట్ట ఉబ్బరం, తెల్లవారుజామున అలసట, నిద్రమత్తు, ఆడేటప్పుడు త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్న ఇటీవల ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. అతనికి పలు వైద్య పరీక్షలను నిర్వహించిన వైద్యులు.. రక్తంలో చక్కెర స్థాయులు 50ఎంజీ/డిల్ కంటే తక్కువగా ఉండటం, టైగ్ర్లిసరైడ్లు 786, సీరమ్ కొలెస్ట్రాల్ 1200 ఉండడం గమనించారు. కాలేయ పనితీరు సవ్యంగా లేదని గుర్తించారు. అలా్ట్రసౌండ్ స్కానింగ్ చేయగా.. బాలుడి కాలేయం గణనీయంగా పెరిగినట్టు వెల్లడైంది. దీంతో బాలుడి కాలేయాన్ని కొంతమేర సేకరించి బయాప్సీ, జన్యు పరీక్షల నిర్వహించగా ‘గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్ టైప్-3’ ఉన్నట్లు తేలింది. ఈ సమస్య వల్ల.. ఆ బాలుడు తీసుకున్న ఆహారం గ్లూకోజ్‌గా మారి ఇతర అవయాలకు వెళ్లకుండా అక్కడే నిల్వ ఉంటోందని, దానివల్లే బాలుడు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాడని గుర్తించారు. ఈ సమస్యకు వెంటనే చికిత్స చేయకపోతే మెదడు, గుండెకండరాలపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్ టైప్-3 (జీఎ్‌సడి) సమస్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి అని వారు వెల్లడించారు.
14 గంటల పాటు మార్పిడి
బాలుడి తండ్రి నుంచి సుమారు 240 గ్రాముల లివర్ టిష్యూ సేకరించి దాదాపు 14 గంటలు సర్జరీ నిర్వహించినట్లు ఉస్మానియా ఆస్పత్రి సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ మధుసూదన్ తెలిపారు. బాలుడి కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నందున.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు చెప్పారు. ఆ చిన్నారికి అవసరమైన ఇమ్యూనోసప్రెసెంట్ మందులను జీవితాంతం ఉచితంగా అందిస్తామన్నారు. మార్పిడి తర్వాత బాలుడు కోలుకుంటున్నాడని చెప్పారు. ఈ అరుదైన చికిత్స చేసిన వైద్య బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. కాగా.. ఈ చికిత్స ప్రైవేటు ఆస్పత్రిలో చేయించుకుంటే దాదాపు రూ.50-60 లక్షల దాకా ఖర్చవుతుందని అంచనా.
ఏమిటీ వ్యాధి?
మన శరీరం గ్లూకోజ్ (చక్కెర)ను గ్లైకోజెన్ రూపంలో కాలేయంలో, కండరాలలో దాచుకుంటుంది. మనకు శక్తి అవసరమైనప్పుడు డీబ్రాంచింగ్ ఎంజైమ్ (జీడీఈ) అనే పదార్థం ఈ గ్లైకోజెన్‌ను తిరిగి గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఈ ఎంజైమ్ లోపించినప్పుడు శరీరం గ్లైకోజెన్‌ను పూర్తిగా వాడుకోలేదు. ఫలితంగా అది కాలేయంలో, కండరాలలో పేరుకుపోతుంది. దీన్నే ‘గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్-3 (జీఎ్‌సడీ 3)’ లేదా కోరి వ్యాధి లేదా ఫోర్బ్స్ వ్యాధిగా వ్యవహరిస్తారు. దీంట్లో రెండు రకాలుంటాయి. ఒకటి.. జీఎ్‌సడీ-3ఏ. ఇది కాలేయం, కండరాలు (గుండెతో సహా) రెండింటిపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి బారిన పడేవారిలో దాదాపు 80ు మంది దీని బాధితులే ఉంటారు. రెండో రకం జీఎ్‌సడీ-3బి. ఇది కేవలం కాలేయంపై మాత్రమే ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి సాధారణంగా చిన్నతనంలోనే బయటపడుతుంది. దీనిబారిన పడినవారిలో రక్తంలో చక్కెర స్థాయులు పడిపోతాయి. కాలేయంలో గ్లైకోజెన్ పేరుకుపోవడం వల్ల అది వాచినట్లు పెద్దగా అవుతుంది. పిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎత్తు పెరగరు. నడకలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలుంటాయి. సాధారణంగా ఈ వ్యాధికి తరచుగా ఆహారం ఇవ్వడం, పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం, మొక్కజొన్న పిండి (కార్న్ స్టార్చ్) వంటి ప్రత్యేక డైట్ థెరపీ చేస్తారని వైద్యులు వివరించారు. కాలేయం తీవ్రంగా దెబ్బతిన్న సందర్భాల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.