Share News

ఒకేసారి 5 అవయవాల మార్పిడి

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:54 AM

దేశంలో కార్పొరేట్‌ వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పెరిగాయి. సాధారణంగా ఒకసారి ఒకరోగి శరీరంలోని ఒక అవయవాన్ని...

ఒకేసారి 5 అవయవాల మార్పిడి

  • 36 గంటలపాటు ఏకబిగిన శస్త్రచికిత్స

  • ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల ఘనత

  • ఇది ప్రభుత్వ ఆస్పత్రిలో దేశంలోనే ప్రథమం

  • వైద్యులను అభినందించిన ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌, మంత్రి దామోదర

హైదరాబాద్‌/సిటీ/మంగళ్‌హాట్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): దేశంలో కార్పొరేట్‌ వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పెరిగాయి. సాధారణంగా ఒకసారి ఒకరోగి శరీరంలోని ఒక అవయవాన్ని మార్చే చికిత్సలు చేస్తుంటారు. కానీ, ఒకేసారి ఐదు అవయవాలు విజయవంతంగా మార్చితే.. అందుకు అవిశ్రాంతంగా 36 గంటలపాటు శస్త్రచికిత్స కొనసాగిస్తే.. అది కూడా ఒక ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహిస్తే.. అది కచ్చితంగా సరికొత్త రికార్డే అవుతుంది. అత్యంత క్లిష్టమైన, అరుదైన ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి వైద్యులు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోగికి ఓకేసారి ఐదు అవయవ మార్పిడిలు చేయడం దేశంలో ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. ఇంతటి ఘనత సాధించిన ఉస్మానియా వైద్య బృందానికి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశం నలుమూలల నుంచి ప్రసంశలు అందాయి. జాతీయ అవయవాలు, కణజాల మార్పిడి సంస్థ (ఎన్‌ఓటీటీవో) డాక్టర్స్‌ డే సందర్భంగా బుధవారం తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఉస్మానియా వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించింది. ఫ్యామిలియల్‌ అడెనోమాటస్‌ పాలిపోసిస్‌ (ఎఫ్‌ఏపీ) సమస్య ఉన్న రోగికి భారత ప్రభుత్వ ఆస్పత్రుల్లో మల్టీ విసెరల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స నిర్వహించటం ఇదే మొదటిసారి అని పేర్కొంది.

యువ ఇంజనీర్‌కు ప్రాణదానం

సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్‌ శ్రీశైలం గౌడ్‌ ప్యామిలియల్‌ అడెనోమాటస్‌ పాలిపోసిస్‌ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో పాటు పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో పెద్దపేగును పూర్తిగా, చిన్న పేగులో 60 శాతాన్ని తొలగించారు. తర్వాత అతను తీవ్ర పోషకాహార లోపంతో బరువు తగ్గడం, కడుపునొప్పితో బాధపడుతూ ఆరునెలల క్రితం ఉస్మానియా ఆస్పత్రిని ఆశ్రయించాడు. ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తిని అతని జీర్ణవ్యవస్థ పూర్తిగా కొల్పోయింది. అతడి కడుపు, డ్యుయోడినం, ప్యాంక్రియాస్‌, చిన్నపేగు, పెద్దపేగు పూర్తిగా చెడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అవయవ మార్పిడి ఒక్కటే ఆఖరి మార్గమని తేల్చారు. అదే సమయంలో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఒక మహిళారోగి కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు రావడంతో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సకు పూనుకున్నారు. దాత శరీరం నుంచి జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఐదు అవయవాలు జీర్ణాశయం, డ్యుయోడినం, ప్యాంక్రియాస్‌, చిన్నపేగు, కుడివైపు పెద్ద పేగులను ఒకే క్లస్టర్‌గా సేకరించారు. (ఇదే దాత ఇచ్చిన కళ్లు, చర్మం, కాలేయం, మూత్రపిండాలతో మరో నలుగురికి కూడా పునర్జన్మ లభించింది). జూన్‌ 29 నుంచి 30 సాయంత్రం వరకు ఏకధాటిగా 36 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి, ఆ అవయవాలను శ్రీశైలం గౌడ్‌కు విజయవంతంగా అమర్చారు. ఈ చికిత్స కోసం అంతర్జాతీయ వైద్య నిపుణుల సలహాలు స్వీకరించారు. సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి, చీఫ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జర్‌ డాక్టర్‌ సీహెచ్‌ మధుసూదన్‌ నేతృత్వంలోని వైద్య బృందం ఈ చికిత్సను నిర్వహించింది. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేశ్‌ సహాయ్‌ పర్యవేక్షణలో గ్యాస్ర్టో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, అనస్థీషియా, క్రిటికల్‌ కేర్‌ విభాగాలకు చెందిన సిబ్బంది షిప్టులవారీగా రాత్రింబవళ్లు శ్రమించారు. రోగిని 36 గంటలపాటు అనస్థీషియా స్థితిలో ఉంచి బీపీ, పల్స్‌ పడిపోకుండా కాపాడటం అద్భుతమని వైద్యులు చెబుతున్నారు.


ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్స..

ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఈ చికిత్స చేయాలంటే రూ.కోటి పైనే ఖర్చవుతుంది. అత్యధిక రిస్క్‌ కారణంగా కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు ఈ చికిత్స చేయడానికి ముందుకు రావని వైద్యులు తెలిపారు. అలాంటి చికిత్సను ఉస్మానియా వైద్యులు పైసా ఖర్చు లేకుండా ‘ఆరోగ్యశ్రీ పథకం’ కింద ఉచితంగా నిర్వహించటం విశేషం.

అభినందనల వెల్లువ..

అరుదైన చికిత్సతో చరిత్ర సృష్టించిన ఉస్మానియా వైద్యులను ప్రధాని మోదీ అభినందించారు. అలుపెరుగని కృషితో ఉస్మానియా వైద్యులు అద్భుతం చేశారని ప్రశంసించారు. వైద్య బృందం సాధించిన విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్ఠను మరింత పెంచిందని అన్నారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 440 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, 1,616 స్పెషలిస్ట్‌ డాక్టర్‌, సుమారు 800 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులతోపాటు మొత్తం 15 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు మంత్రి దామోదర తెలిపారు. కాగా, మంత్రి మంగళవారం నిమ్స్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జలుబు, జ్వరం ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు నిమ్స్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని మంత్రి కార్యాలయం తెలిపింది.

Updated Date - Jul 02 , 2026 | 04:54 AM