సిగరెట్ వెలిగించు.. కూలర్‌లో నీళ్లు నింపు
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:30 AM
ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్లు గత నాలుగైదు నెలలుగా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు.
ఉస్మానియా డెంటల్ కాలేజీలో జూనియర్లపై సీనియర్ల ర్యాగింగ్
పనులు చేశాకే చదువుకోవాలని హుకుం
మాట వినకపోతే గోడ కుర్చీ, భౌతిక దాడి
నాలుగైదు నెలలుగా అరాచకం.. ప్రిన్సిపాల్‌కు బాధితుల ఫిర్యాదు
12 మందిని సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్
సుల్తాన్‌బజార్ పీఎ్‌సలో ఫిర్యాదు.. కేసు
ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు: డీసీపీ
హైదరాబాద్ సిటీ/అఫ్జల్‌గంజ్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్లు గత నాలుగైదు నెలలుగా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. వీరి బాధను చూసిన ఓ పీజీ విద్యార్థి సీనియర్లను వారించటానికి ప్రయత్నిస్తే, అతనిపై కూడా దాడి చేశారు. చివరకు కాలేజీ ప్రిన్సిపాల్ సర్జీవ్‌సింగ్ యాదవ్, అధ్యాపకులు చెప్పినా ఖాతరు చేయలేదు. దీంతో ఫైనల్ ఇయర్‌కు చెందిన 12 మంది విద్యార్థులను కాలేజీ నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. వారిపై సుల్తాన్ బజార్ పోలీసులకు ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కౌన్సెలింగ్ ఇచ్చిన 24 గంటల్లోనే మళ్లీ ర్యాగింగ్..
అఫ్జల్‌గంజ్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో బీడీఎస్ చదువుతున్న విద్యార్థులకు కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల హాస్టల్‌లో వసతి కల్పించారు. వీరిని ఫైనల్ ఇయర్ విద్యార్థులు గత నాలుగైదు నెలలుగా ర్యాగింగ్ చేస్తూ వేధిస్తున్నారు. ‘ఏయ్.. నా సిగరెట్ వెలిగించు.. స్విగ్గీ ఆర్డర్ వచ్చింది వెళ్లి తీసుకురా.. మా కూలర్‌లో నీళ్లు నింపు అని బెదిరించేవారు. చదువుకుంటున్నామని చెబితే, తమ పని అయిన తర్వాతే చదువుకోవాలని హుకుం జారీ చేసేవారు. వినకపోతే గోడ కుర్చీ వేయిస్తూ వేధించేవారు. భౌతిక దాడులకు పాల్పడేవారు. వీరి భయానికి జూనియర్లు హాస్టల్ మెస్‌కు వెళ్లడం కూడా మానేశారు. ఈ విషయం గుర్తించిన హౌస్ సర్జన్ దినేష్ మిశ్రా జోక్యం చేసుకొని జూనియర్లను వేధించడం తగదని సూచించారు.
దీంతో వారు అతనిపై కూడా దాడి చేశారు. వేధింపులు భరించలేక జూనియర్ విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు ఈ నెల 9న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదేరోజు ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థులను ప్రిన్సిపాల్ పిలిచి మందలించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా 24 గంటలు గడవకముందే వారు మళ్లీ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఈ నెల 10న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు జూనియర్లపై దాడి చేశారు. ఈ విషయాన్ని జూనియర్లు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లటంతో అధ్యాపకులతో ప్రత్యేక కమిటీఏర్పాటు చేసి విచారణ జరిపించారు. ర్యాగింగ్ నిజమేనని తేలటంతో 12 మంది విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ విద్యార్థులపై గతంలోనూ ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించారు. కాలేజీ అనుబంధ ఆస్పత్రిలో సరిగా డ్యూటీలు చేయకపోవడం, బాధ్యతారహిత్యంగా వ్యవహరించడంపై ఫిర్యాదులున్నాయి. కొత్త సంవత్సర వేడుకల సమయంలో హాస్టల్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు కూడా వీరిపై ఆరోపణలున్నాయి. కాలేజీలో ఎవరు ర్యాగింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సర్జీవ్‌సింగ్ యాదవ్ హెచ్చరించారు.
ర్యాగింగ్ ఘటనపై సుల్తాన్‌బజార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం మీడియాకు వెల్లడించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే ఆరు నెలల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ర్యాగింగ్ వల్ల బాధితులు ఆత్మహత్య చేసుకుంటే దోషులకు జీవిత ఖైదు పడే అవకాశముందని చెప్పారు. ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థుల పూర్వ చరిత్రపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.