ఒరాకిల్ ఉద్యోగుల తొలగింపుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:09 AM
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్‌లో కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపుపై హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది యెన్నం బాలచందర్ రెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్...
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్‌లో కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపుపై హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది యెన్నం బాలచందర్ రెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత పునర్‌వ్యవస్థీకరణ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని తొలగిస్తున్నారని, దీని ప్రభావంతో భారతదేశ ఉద్యోగులు కలవరపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒరాకిల్ చేపడుతున్న భారీ కోతలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవనోపాధి హక్కును ఉల్లంఘించడమేనని ఆయన బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో ఎటువంటి పారదర్శకత లేదని, సరైన నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగిస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. బాధితులకు తమ వాదన వినిపించుకునే అవకాశం కల్పించకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్థమన్నారు. భారత్‌లో ఇప్పటికే జరిగిన, భవిష్యత్తులో జరగబోయే ఉద్యోగాల కోతలపై వెంటనే పూర్తి వివరాలు ేసకరించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కమిషన్‌ను కోరారు.