Share News

ప్రతిపక్షం బలపడే అవకాశం

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:28 AM

ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లతోపాటు పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ఈ ఏడాది ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని వేద పండితులు మృత్యుంజయశర్మ...

ప్రతిపక్షం బలపడే అవకాశం

  • పంచాగ పఠనంలో మృత్యుంజయశర్మ, ఫణీంద్రశర్మ

  • తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు.. హాజరైన కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లతోపాటు పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ఈ ఏడాది ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని వేద పండితులు మృత్యుంజయశర్మ, ఫణీంద్రశర్మ వెల్లడించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే, ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్‌ఎస్‌ ఎదిగే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మృత్యుంజయశర్మ, ఫణీంద్రశర్మ పంచాంగ పఠనం చేశారు. విద్యావిధానంలో జరుగుతున్న మార్పులు... విద్యార్థులకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. విదేశీ శక్తుల కుట్రలను మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొంటారని, ఇరుగు-పొరుగు దేశాలతో కొన్ని ఉద్రిక్తలు చోటు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురిసే సూచనలున్నాయని, ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలు బాగా పండే అవకాశం ఉందని, రైతుల ఆత్మహత్యలు తగ్గే సూచనలు ఉన్నాయని చెప్పారు. బంగారం, వెండి, ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని, కూరగాయల ధరలు కొంతవరకు తగ్గవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్‌ నేతలు హాజరయ్యారు.

Updated Date - Mar 20 , 2026 | 05:28 AM