Share News

ఆపరేషన్‌ పులి

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:21 AM

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల అటవీ ప్రాంతంలో గత ఐదు రోజులుగా పెద్ద పులి ఆచూకీ కోసం చేపట్టిన...

ఆపరేషన్‌ పులి

  • ఆచూకీ కోసం ఐదోరోజుకు చేరిన వేట

తుర్కపల్లి/కొండపాక, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల అటవీ ప్రాంతంలో గత ఐదు రోజులుగా పెద్ద పులి ఆచూకీ కోసం చేపట్టిన ‘ఆపరేషన్‌ పులి’ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ, పులి ఆచూకీ మాత్రం చిక్కలేదు. దీంతో అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపూర్‌, దత్తాయపల్లి రిజర్వు ఫారెస్టు పరిధిలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. ఈ 5 రోజుల్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో పులి పాద ముద్రలను గుర్తించారు. అయితే, ఇప్పటివరకు పెద్దపులి రూపం ట్రాప్‌ కెమెరాల్లో చిక్కలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. భువనగిరి ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రమే్‌షనాయక్‌ మాట్లాడుతూ.. పులి కదలికలను తెలుసుకునేందుకు గస్తీని ముమ్మరం చేశామన్నారు. మరోవైపు, సిద్దిపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో కొన్ని రోజుల నుంచి పులి సంచరిసున్నట్లు వార్తలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సిద్దిపేట నుంచి ఖమ్మంపల్లికి వెళ్తున్న ఓ వ్యక్తి, పులి అటవీ ప్రాంతంలో వెళ్లడం చూశానని స్థానికులకు చెప్పడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజర్‌ రాధా సిబ్బందితో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే, ఆ ప్రాంతంలో పులి సంచారానికి సంబంధించి బలమైన ఆధారాలు దొరకలేదని పేర్కొన్నారు. అలాగే మండలంలోని పలు గ్రామాల వాట్సాప్‌ గ్రూపుల్లో పులికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. గ్రామపంచాయతీ అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

Updated Date - Jan 22 , 2026 | 05:21 AM