Share News

అర్ధరాత్రి రంగంలోకి 5వేల మంది పోలీసులు!

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:16 AM

అరాచక శక్తులు, అల్లరిమూకల ఆటకట్టించడానికి హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ‘ఆపరేషన్‌ కవచ్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు.

అర్ధరాత్రి రంగంలోకి 5వేల మంది పోలీసులు!

  • ‘ఆపరేషన్‌ కవచ్‌’లో లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు

  • పలుచోట్ల సీపీ సజ్జనార్‌ స్వయంగా పరిశీలన

  • మైనర్లకు గదులిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

  • త్వరలో డిజిటల్‌ విజిటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం!

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): అరాచక శక్తులు, అల్లరిమూకల ఆటకట్టించడానికి హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ‘ఆపరేషన్‌ కవచ్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి 5 వేల మంది పోలీసులు నగరంలోని హోటళ్లు, లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. మొత్తం 562 హోటళ్లు, లాడ్జిల్లో రిజిస్టర్లను, బస చేయడానికి వచ్చినవారి గుర్తింపు కార్డులను పరిశీలించి, వారి నుంచి నిర్వాహకులు ఐడీల నకలు తీసుకుంటున్నారో లేదో పరిశీలించారు. సజ్జనార్‌ స్వయంగా నాంపల్లి రైల్వే స్టేషన్‌, అమీర్‌పేటలో పలు లాడ్జిలను తనిఖీ చేశారు. లాడ్జిల్లో బస చేసినవారితో మాట్లాడి, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, రావడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో గదులు ఇవ్వొద్దని, గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును ధ్రువీకరించుకోవాలని లాడ్జిల నిర్వాహకులకు స్పష్టం చేశారు. త్వరలోనే నూతన డిజిటల్‌ విజిటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. హోటల్‌ పరిసరాలు, ఎంట్రీ, ఎగ్జిట్‌, రిసెప్షన్‌ ఏరియాలు స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అవి నిరంతరాయంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. కవచ్‌లో భాగంగా రెండు రోజుల క్రితం అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి పోకిరీలు, అల్లరిమూకలకు ముకుతాడు వేసిన సంగతి తెలిసిందే. నిబంధనలు పాటించని వారి నుంచి 2,149 వాహనాలను సీజ్‌ చేశారు.

Updated Date - Jun 07 , 2026 | 06:16 AM