ఆపరేషన్ కర్రెగుట్టలు-2 ప్రారంభం
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:47 AM
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టలు-2ను బుధవారం ప్రారంభించాయి.
మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా గాలింపు
కర్రెగుట్టల్లో మోహరించిన 2 వేల మంది బలగాలు
చర్ల, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టలు-2ను బుధవారం ప్రారంభించాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ చీఫ్ దేవ్‌జీతో పాటు కోసా, దామోదర్, పాపారావు వంటి కీలక నాయకులు కర్రెగుట్టల్లోనే తలదాచుకున్నారనే సమాచారంతో ఈ ఆపరేషన్ మొదలైంది. సుమారు 290 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని మావోయిస్టులు కొంతకాలంగా స్థావరంగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 2వేల మంది కేంద్ర బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. గతేడాది జరిగిన ఆపరేషన్ కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఆ తర్వాత అనేక మంది లొంగిపోయారు. ప్రధాన నాయకులు ఇంకా అజ్ఞాతంలోనే ఉండడంతో, వారిని పట్టుకోవడమే లక్ష్యంగా కేంద్రం ఈ రెండో ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇప్పటికే వేలాది మంది బలగాలు సరిహద్దు అడవుల్లో మోహరించాయి. ఏక్షణానైనా భారీ ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం కనిపిస్తోంది.