Share News

కర్రెగుట్టల్లో భారీ కూంబింగ్‌

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:16 AM

తెలంగాణ-ఛత్తీ్‌సగడ్‌ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు ఆపరేషన్‌ కగార్‌-2ను ప్రారంభించాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలతో పాటు కొన్ని దళాలు ఉన్నాయనే నిఘా...

కర్రెగుట్టల్లో భారీ కూంబింగ్‌

  • మావోయిస్టు అగ్రనేతలతో పాటు దళాలు తలదాచుకున్నాయని జల్లెడ

  • 2 వేల మంది కేంద్ర బలగాల మోహరింపు

  • ఎన్‌కౌంటర్‌ జరిగిందంటూ వార్తలు..

చర్ల/వెంకటాపురం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ-ఛత్తీ్‌సగడ్‌ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు ఆపరేషన్‌ కగార్‌-2ను ప్రారంభించాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలతో పాటు కొన్ని దళాలు ఉన్నాయనే నిఘా వర్గాల సమాచారంతో గ్రేహౌండ్స్‌, సీఆర్పీఎఫ్‌, కోబ్రా, డీజీఎ్‌ఫకు చెందిన సుమారు 2 వేల మంది బలగాలు పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్‌ బీజాపూర్‌ జిల్లా ఊసూరు స్టేషన్‌ పరిధిలోని నంబి అడవుల నుంచి మొదలైనట్లు తెలుస్తోంది. తెలంగాణ మీడియా గురువారం నంబి ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. నంబి గ్రామం కర్రెగుట్టలకు సమీపంలో ఉంటుంది. తెలంగాణ సరిహద్దుకు సుమారు 20 కిలోమీటర్లు దూరం. ఆపరేషన్‌ కగార్‌ 2 నేపథ్యంలో గ్రామమంతా నిర్మానుష్యంగా కనిపించింది. స్థానికులు అక్కడక్కడ కనిపించారు. ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడలేదు. కేంద్ర బలగాలు ఇటుగా వచ్చాయా అంటే బుధవారం వచ్చాయని ఓ యువకుడు తెలిపాడు. గురువారం మాత్రం ఎక్కడా ఎలాంటి కాల్పులు జరగలేదన్నాడు. ఆ ప్రాంతంలో హెలికాప్టర్లు తిరిగే శబ్దాలు వినిపించాయి. గత ఏడాది ఏప్రిల్‌, మే నెల్లో నంబి ప్రాంతం నుంచే ఆపరేషన్‌ కర్రెగుట్టలకు బలగాలు ముందుకుసాగాయి. నాడు ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టులు మృతిచెందారు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దు నుంచి ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం ఊసూరు గ్రామం వరకు అడవుల్లో బలగాలు మోహరించాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ చీఫ్‌ తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, సోదీ, మాజీ చీఫ్‌ గణపతి, దామోదర్‌, పాపారావు, మంతు, అరుణ, కల్లుదాదా, ఇతర మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈ ఆపరేషన్‌ ప్రారంభించాయి. కర్రె గుట్టలు, ములుగు జిల్లా అడవుల్లో సుమారు 300 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. డ్రోన్లు, శాటిలైట్‌ చిత్రాలతో మావోయిస్టుల కదలికలను పసిగడుతున్నారు. కర్రెగుట్టల్లోని డోలి, చెలిమెల ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు, ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ మీడియాలో వార్తలొచ్చాయి. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులున్నట్టు ప్రచారం సాగింది. ఈ వార్తలపై ఛత్తీ్‌సగఢ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ స్పందించారు. ఎన్‌కౌంటర్‌ జరగలేదని, తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దంటూ ఆయన మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు.

Updated Date - Feb 20 , 2026 | 01:16 AM