సైబర్ నేరగాళ్లపై ఆపరేషన్ క్రాక్ డౌన్
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:23 AM
సైబర్ నేరాలకు పాల్పడటమే కాకుండా ఆ నేరగాళ్ల ఆర్ధిక లావాదేవీలకు అవ సరమైన మ్యూల్ బ్యాంకు ఖాతాలను అందించే ముఠాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో విరుచుకుపడింది.
16 జిల్లాల్లో ఏకకాలంలో దాడులు
హైదరాబాద్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలకు పాల్పడటమే కాకుండా ఆ నేరగాళ్ల ఆర్ధిక లావాదేవీలకు అవ సరమైన మ్యూల్ బ్యాంకు ఖాతాలను అందించే ముఠాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో విరుచుకుపడింది. ఆపరేషన్ క్రాక్‌డౌన్ పేరిట ఏకకాలంలో తెలంగాణలోని 16 జిల్లాల్లో సైబర్ క్రైం పోలీసులు దాడులు నిర్వహించారు. 137 బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలు కొనసాగిస్తున్న 1,888 మంది నేరగాళ్లకు సంబంధించిన ఖాతాలను గుర్తించారు. ఈ బ్యాంకు ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా 9,431 సైబర్ నేరాల్లో డబ్బు బదిలీ జరిగిందని, తెలంగాణలో 782 సైబర్ నేరాలకు ఈ బ్యాంకు ఖాతాలకు సంబంధం ఉన్నట్లు గుర్తించామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 137 పోలీసు బృందాలు రంగంలో దిగాయని, మొత్తం 512 మంది పోలీసు అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారని ఆయన వివరించారు. సుల్తాన్‌బజార్‌లోని ఒక బ్యాంకులో ఉన్న ఖాతా ద్వారా 496 సార్లు సైబర్ నేరగాళ్లకు డబ్బు బదిలీ జరిగిందని, అలాగే 4బ్యాంకులకు సంబంధించి 298 ఖాతాల్లో పెద్దఎత్తున అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని, బ్యాంకు అధికారుల పాత్రపై విచారణ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీజీపీ తెలిపారు.