మిగిలింది పది రోజులే..
ABN , Publish Date - Jul 24 , 2026 | 02:24 AM
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. మరో 10 రోజుల గడువు ఉండడంతో బూత్ లెవెల్ అధికారుల నుంచి కలెక్టర్ వరకు వంద శాతం లక్ష్య సాధనకు దృష్టి పెట్టారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ‘సర్’ ప్రక్రియ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. మరో 10 రోజుల గడువు ఉండడంతో బూత్ లెవెల్ అధికారుల నుంచి కలెక్టర్ వరకు వంద శాతం లక్ష్య సాధనకు దృష్టి పెట్టారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ‘సర్’ ప్రక్రియ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు 83.82 శాతం తిరిగివచ్చాయి. ఇంకా 16 శాతం వరకు రావాల్సి ఉంది. జిల్లాలో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి వెనక్కి తీసుకునేందుకు చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. బూత్ స్థాయిలో ఒకచోట ఉండి ఎన్యూమరేషన్ ఫారాలు తెప్పించుకుంటున్నారు. ఈనెల 24వ తేదీ వరకే గడువు ముగిసినప్పటికీ రాజకీయ పక్షాల కోరిక మేరకు ఎన్నికల కమిషన్ ఆగస్టు 3 తేదీ వరకు పొడిగించింది. జిల్లాలో ఇప్పటివరకు 475694 ఎన్యూమరేషన్ పారాలు అందజేశారు. వీటిలో 398731ఫారాలు డిజిటలైజేషన్ చేశారు జిల్లా వ్యాప్తంగా 83.82 శాతం డిజిటలైజేషన్ జరిగింది. జిల్లాలో ప్రధానంగా ఉన్న వేములవాడ నియోజకవర్గంలో 229132 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 195119 ఫారాలు డిజిలైజేషన్ చేశారు. 85.16 శాతం జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గంలో 246562 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 203612 ఫారాలు డిజిలైజేషన్ చేశారు. 82.58 శాతం పూర్తయింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో డిజిటలైజేషన్ నెమ్మదిగానే సాగుతోంది.
స్వగ్రామాల్లోనే ఓటుకు ప్రాధాన్యం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి, వ్యాపారాలు, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు తమ సొంత ఊర్లోనే ఓటు హక్కును నిలుపుకునేందుకు ఆసక్తి చెబుతున్నారు. హైదరాబాద్‌లాంటి నగరాల్లో సొంత అపార్టుమెంట్‌లో ప్లాట్లు ఉండి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న సర్ మ్యాపింగ్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ చేపట్టడంతో స్వగ్రామంలోనే ఓటు హక్కు ఉండే విధంగా ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు జిల్లాలోని అనేక గ్రామాల నుంచి పిల్లల చదువులు, వ్యాపారాల దృష్ట్యా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సొంత గ్రామంతో పాటు మున్సిపల్ పరిధిలో తాముంటున్న వార్డుల్లో కూడా ఓట్లు కలిగి ఉన్నారు. రెండు చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ జరిగింది. ప్రస్తుత సర్ ప్రక్రియలో ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉండడంతో సొంత గ్రామాల్లో ఓటుకు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా వ్యవసాయ భూములు, సొంత ఇల్లు గ్రామాల్లో కలిగి ఉన్నారు. నిత్యం సొంత గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు గ్రామాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు స్థానిక పదవులు ఆశిస్తున్న వారు కూడా తమ ఓటు హక్కు గ్రామంలో ఉండే విధంగా చూసుకుంటున్నారు. దీంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఓటుపై ఆందోళన వద్దు
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కోసం 2002 జాబితాను ప్రామాణికంగా తీసుకొని సర్వే జరుగుతున్న నేపథ్యంలో చిన్న పొరపాట్లు జరిగిన ఓటు తొలగిపోతుందని ఆందోళన ఓటర్లలో ఉంది. ఇంటి పేరులో తేడా ఉన్నా, తండ్రి, భర్త పేరు, ఇతర వివరాల్లో వ్యత్యాసం ఉన్న ఆ ఓటర్ల వివరాలు అనుమానాస్పద జాబితాలోకి వెళ్తున్నాయి. ఈ జాబితాలోకి వెళ్లిన ఓటర్ల వివరాలపై విచారణ చేపట్టి తిరిగి ఓటర్ జాబితాలో చేస్తామని అధికారులు చెబుతున్నారు. సర్ ప్రక్రియపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, రెండు చోట్ల ఓటు ఉన్న, మరణించిన వారి ఓటర్లు మాత్రమే తొలగిస్తారని స్పష్టం చేస్తున్నారు. ఓటుపై ఆందోళన వద్దని ప్రచారం చేస్తున్నారు.
అక్టోబరు 12న తుది జాబితా..
ఓటర్ జాబితాలో అనర్హులను తొలగించి సమగ్రమైన జాబితాను సిద్ధం చేసే దిశగా కొనసాగుతున్న ఓటర్ జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం జిల్లాలో వేగంగా కొనసాగుతున్న దశలో ఈనెల 24వ తేది గడువు ఉండగా 50 శాతం కూడా పూర్తికాని సందర్భంగా సవరణ షెడ్యూల్ ఎన్నికల కమిషన్ మార్పు చేసింది. ఆగస్టు 3వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి తీసుకోవడంతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆగస్టు 10వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితాను వెల్లడిస్తారు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు క్లైములు, అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 8 వరకు వాటిని పరిష్కరించి తుది ఓటర్ జాబితాను అక్టోబర్ 12న వెల్లడిస్తారు. దీంతో జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయిలో ఇంచార్జిలను నియమించి సర్ ప్రక్రియపై దృష్టి పెట్టారు.
జిల్లాలో ఇప్పటివరకు డిజిటలైజేషన్ వివరాలు
మండలం ఫారాల పంపిణీ డిజిటలైజేషన్ శాతం
మేడిపల్లి 24535 21586 87.98
భీమారం 17744 15371 86.63
కథలాపూర్ 38184 32091 84.04
రుద్రంగి 8699 7409 85.17
చందుర్తి 28257 24018 85.00
వేములవాడ రూరల్ 18998 16785 88.35
వేములవాడ 58143 46204 79.47
కోనరావుపేట 34572 31655 91.56
వీర్నపల్లి 11606 10194 87.83
ఎల్లారెడ్డిపేట 40195 34233 85.17
గంభీరావుపేట 36737 32890 89.53
సిరిసిల్ల 80541 61871 76.82
తంగళ్ళపల్లి 39569 32016 80.91
ముస్తాబాద్ 37914 32408 85.48
మొత్తం 475694 398731 83.82