Share News

ఆన్‌లైన్‌ సమస్యలు.. ‘సర్‌’!

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:33 AM

ఓటర్‌ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమగ్ర సమాచారం లేక, 2002 నాటి, ప్రస్తుత జాబితాలో..

ఆన్‌లైన్‌ సమస్యలు.. ‘సర్‌’!

  • ఎన్యూమరేషన్‌ ఫారం సమర్పణలో ఇబ్బంది

  • బీఎల్వోలు రాక ఆన్‌లైన్‌లో ప్రయత్నిస్తున్న ఓటర్లు

  • పేరు, వయసు, తల్లిదండ్రుల వివరాలు, ఎపిక్‌ కార్డు నంబర్లలో తేడాలతో సమస్యలు

  • అలాంటి వారు బీఎల్వోలను సంప్రదించి ఫారం నింపి ఇవ్వాలంటున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఓటర్‌ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమగ్ర సమాచారం లేక, 2002 నాటి, ప్రస్తుత జాబితాలో ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల వివరాలు సరిపోలక సమస్యలు వస్తున్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి.

బీఎల్వోలు రావడంలో జాప్యంతో..

‘సర్‌’ బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్వో) ఇంటింటికీ వెళ్లేందుకు ఆలస్యం అవుతోంది. కొన్నిచోట్ల బీఎల్వోలు వస్తున్న సమయాల్లో ఓటర్లు ఇళ్లలో అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్‌ ఫారం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇబ్బంది ఎదురవుతోంది. కొందరికి 2002 నాటి, ప్రస్తుత ఓటర్‌ జాబితాలోని పేర్లు, వయసు వివరాలు సరిపోలడం లేదు. మరికొందరి తల్లిదండ్రుల వివరాలు సరిగా లేక ఇబ్బంది ఎదురవుతోంది. బండ్లగూడ సన్‌సిటీలో ఉండే రమేశ్‌కు అక్కడే ఓటు హక్కుంది. ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్‌ ఫారం పూరిస్తూ.. 2002లో షాద్‌నగర్‌లో ఓటు ఉన్న తన తండ్రి/తల్లి పేర్లతో మ్యాపింగ్‌ కోసం వివరాలు నమోదు చేశారు. కానీ ఓటరు కార్డు (ఎపిక్‌ కార్డు) నంబర్‌ తప్పుగా ఉందంటూ చూపుతోందని ఆయన చెబుతున్నారు.


ఇక పాత, ప్రస్తుత ఎపిక్‌ కార్డు నంబర్లలోనూ తేడాలున్నాయని.. అది కూడా సమస్యగా మారిందని మోతీనగర్‌లో ఉండే మరో ఓటర్‌ తెలిపారు. ఇక ఆప్షన్లు సరిగా లోడ్‌ కాకపోవడంతోనూ ఇబ్బంది ఎదురవుతోంది. దీనితో బీఎల్వోల నుంచి ఫారం తీసుకుని వివరాలు పూరించి ఇవ్వడం మంచిదని అధికారులు చెబుతున్నారు. బీఎల్వోలు వివరాలను, తగిన ఆధారాలను పరిశీలించి.. అక్షరదోషాలు, వయసు వంటి తప్పులను సరిచేసి, మ్యాపింగ్‌ చేస్తారని వివరిస్తున్నారు. సర్‌ ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ వెళుతున్న బీఎల్వోలకు ఓటర్ల చిరునామా దొరక్క ఇబ్బంది ఎదురవుతోంది. ఇంటి నంబర్ల గందరగోళం, కొత్త-పాత ఇళ్ల నంబర్ల మార్పులతో ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేసేందుకు వీల్లేకుండా పోతోంది. ముఖ్యంగా పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 2002 నాటి సర్‌లో పేరులేని వారికి సంబంధించి.. వారి తల్లిదండ్రుల వివరాలతో సరిపోవడంలో ఇబ్బంది వస్తోంది. సదరు ఓటర్లు ఆయా అంశాల నిర్ధారణకు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పిస్తే.. ఓటరు జాబితాలో పేరు నమోదు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jul 04 , 2026 | 06:35 AM