ఆన్‌లైన్ గేమింగ్ ఉచ్చులో పిల్లలు!
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:00 AM
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి ఆన్‌లైన్ గేమింగ్ మాయా ప్రపంచంలో నేటి తరం పిల్లలు మునిగిపోతున్నారా? ఒంటరితనం, డిప్రెషన్‌తో గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారా..
పెంపకమూ ఓ కారణమే
ఆంక్షలు, అతి జాగ్రత్తే శాపాలు
జ్ఞాపకశక్తి తగ్గిపోయి చదువులో వెనుకంజ
దేశంలో 30 కోట్ల మంది ఆన్‌లైన్ గేమర్స్
ఒంటరితనంతో గేమ్స్‌కు బానిసలవుతున్న వైనం
కీలక విషయాలు వెల్లడించిన తాజా అధ్యయనం
హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి ఆన్‌లైన్ గేమింగ్ మాయా ప్రపంచంలో నేటి తరం పిల్లలు మునిగిపోతున్నారా? ఒంటరితనం, డిప్రెషన్‌తో గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారా? ఇందుకు తల్లిదండ్రుల పెంపకమూ ఓ కారణమా? అంటే అవుననే అంటోంది తాజా అధ్యయనం. దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్‌లైన్ గేమర్స్ ఉన్నారని అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో మెజారిటీ పిల్లలు, యువతే కావడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే, తల్లిదండ్రుల పెంపకంలో లోపాలు, స్వీయ నియంత్రణ లోపించడం వంటి కారణాల వల్లే పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీ పరిశోధకులు పీవీ షిమిల్, డాక్టర్ ఆకృతి శ్రీవాస్తవ సంయుక్తంగా మంగళూరులో 16-19 ఏళ్ల వయసున్న 600 మంది విద్యార్థులపై (300 మంది యువకులు, 300 మంది యువతులు) చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికరమైన నిజాలు వెలుగుచూశాయి. ఆ వివరాలను తాజాగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పబ్లిష్ చేసింది.
పెంపకంలోనే ఆ వ్యసనానికి పునాది
తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులైతే... బుజ్జగించడానికో, ముద్దు చేయడానికో, అల్లరి చేయకుండా ఉంటారనో.. పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఇక పది, ఆ పై తరగుతులు చదివే విద్యార్థులకు ఎడ్యుకేషన్ అప్‌డేట్స్ కోసం ఫోన్లు తప్పనిసరి అయ్యాయి. ఇలా.. పిల్లల చేతిలోకి వచ్చిన ఫోన్.. ఆ తర్వాతి కాలంలో వ్యసనంగా మారుతోంది. తాజా పరిశోధన ప్రకారం తల్లిదండ్రుల పెంపక విధానం పిల్లలపై తీవ్రప్రభావం చూపుతోంది. ఇందు లో ఒకటి అతి జాగ్రత్త. మితిమీరిన డిమాండ్లు, పిల్లలపై అతిగా ఆంక్షలు విధిస్తూ, ప్రతి విషయంలోనూ వారిపై ఒత్తిడి తెచ్చే పెంపకం. మరొకటి నిరంకుశ పెంపకం. పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, కఠినమైన క్రమశిక్షణతో భయపెట్టే ధోరణి. ఈ రెండు పద్ధతుల వల్ల పిల్లలు ఇంట్లో మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఒంటరితనాన్ని, ఒత్తిడిని మరిచిపోవడానికి ఆన్‌లైన్ గేమింగ్‌ను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. మొత్తంగా గేమింగ్ వ్యసనానికి 25 శాతం కారణం తల్లిదండ్రుల పెంపకం లోపాలేనని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. మరో ముఖ్యమైన అంశం స్వీయ నియంత్రణ లేకపోవడం. దీర్ఘకాలిక లక్ష్యాలు లేకుండా, తక్షణ ఆనందం కోసం ఆరాటపడే యువత సులభంగా గేమింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారని ఆ స్టడీలో తేలింది. స్వీయ నియంత్రణ విషయంలో ఆడ, మగ తేడా ఏమీ లేదని, కాకపోతే అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువగా ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలవుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పబ్‌జీ, ఫ్రీ ఫైర్, క్లాష్ ఆఫ్ క్లాన్స్ వంటి మల్టీప్లేయర్ గేమ్స్ పిల్లలను తీవ్రంగా ఆకర్షిస్తున్నాయి. ఒక్కసారి వీటికి అలవాటైతే సమయం, సందర్భం లేకుండా గంటల కొద్దీ ఆడేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. దీంతో ఊబకాయం, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయని, మానసిక సమస్యలూ కనిపిస్తున్నాయని వెల్లడించింది. ప్రధానంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలయ్యే వారిలో నిద్ర కరువు అవుతోందని పేర్కొంది. ఒంటరితనం, కోపం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలతో పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని తెలిపింది.
పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తూనే..
ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి పిల్లలను కాపాడుకోవడానికి అథారిటేటివ్/డెమొక్రటిక్ పెంపకం ఒక్కటే మార్గమని పరిశోధకులు సూచించారు. తల్లిదండ్రులు కఠినంగా కాకుండా.. పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తూనే, వారికి స్పష్టమైన ఎల్లలను విధించాలని, ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలన్నారు. ఒకవేళ పిల్లలు ఇప్పటికే గేమింగ్‌కు బానిసలైతే.. థెరపీ లు, ప్రత్యేక కౌన్సెలింగ్ టెక్నిక్స్ ద్వారా వారిలో స్వీయ నియంత్రణను పెంచి, ఈ వ్యసనం నుంచి బయటపడేయవచ్చని అధ్యయనం స్పష్టం చేసింది.