మొదలైన ఆన్‌లైన్ జనగణన
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:42 AM
ప్రతి పదేళ్లకోసారి దేశవ్యాప్తంగా నిర్వహించే జనాభా లెక్కల ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. జనగణన-2027కు సంబంధించి రాష్ట్రంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హైదరాబాద్, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ప్రతి పదేళ్లకోసారి దేశవ్యాప్తంగా నిర్వహించే జనాభా లెక్కల ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. జనగణన-2027కు సంబంధించి రాష్ట్రంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనగణనలో భాగంగా జనాభా లెక్కల సిబ్బంది ఇంటింటికి వెళ్లి పౌరుల వివరాలు సేకరిస్తుంటారు. అయితే, ఎన్యుమరేటర్లు వచ్చే వరకు వేచి ఉండకుండా పౌరులే స్వయంగా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఈసారి కల్పించింది. ఈ ఆన్‌లైన్ జనగణన రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైంది. మే 8 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు అవకాశముంది. ఆ తర్వాత రెండు విడతల్లో జనగణన కార్యక్రమం జరగనుంది. మొదటి విడతలో మే11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటి సర్వే, రెండో విడతలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 9-28 వరకు కులగణన నిర్వహిస్తారు. ఈ జనగణన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను జనగణన విభాగం తెలంగాణ సంచాలకులు భారతి హోళికేరి శుక్రవారం మీడియాకు వివరించారు. http://www.test.cen.sus.gov.in/లో తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.